Sathupalli Election Result 2023: సత్తుపల్లిలో సత్తా చాటిన మట్టా రాగమయి.. భారీ మెజార్టీతో..
Sathupalli Assembly Election Result 2023 Live Counting Updates: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజక వర్గం తెలుగుదేశం కంచుకోట.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు పోటీ చేస్తే.. ఆరు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నియోజక వర్గాల డీలిమిటేషన్ కంటే ముందు వరకు తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు.

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మట్టా రాగమయి విజయం సాధించింది. సండ్ర వెంకట వీరయ్యపై ఏకంగా 21243 ఓట్ల మెజారిటీతో రాగమయి విజయం సాధించారు. ఇక సత్తుపల్లి నియోజక వర్గం (Sathupalli Assembly Election) తెలుగుదేశం కంచుకోట అనే విషయం తెలిసిందే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు పోటీ చేస్తే.. ఆరు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నియోజక వర్గాల డీలిమిటేషన్ కంటే ముందు వరకు తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య మూడుసార్లు విజయం సాధించారు. గత 2018 ఎన్నికల్లో మహా కూటమి తరపున సండ్ర విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సండ్ర.
సత్తుపల్లి నియోజకవర్గంలో 2.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1.18 లక్షల మంది, మహిళా ఓటర్లు 1.24 లక్షల మంది. మొన్నటి పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 87.43 శాతం పోలింగ్ నమోదయ్యింది.
సత్తుపల్లి రాజకీయ ముఖచిత్రం..
1952 ఎన్నికల నుంచి 2018 వరకు చాలా మంది ప్రముఖులు అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని వేంసూరు అసెంబ్లీ నియోజకవర్గం 1978లో సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా మారింది. 1952నుంచి 1972 వరకు వేంసూరు నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు కూడా అప్పట్లో అసెంబ్లీ బరిలో నిలిచారు. 1978లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంగళరావుపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాళోజీ తరపున మహాకవి శ్రీశ్రీ ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుకు ఆనుకుని ఉన్న నియోజకవర్గం సత్తుపల్లి. ఈ నియోజకవర్గంలో 5 మండలాలుండగా, మొత్తం 2,38,621 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,16,968 మంది పురుషులు, 1,21,645 మంది మహిళలు, 8 మంది ట్రాన్స్ జెండర్లున్నారు. పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైనా, కొత్త పంటల సాగు, ఆధునిక వ్యవసాయంపై ఇక్కడి రైతులు మొగ్గుచూపుతారు. వరితో పాటు ఆయిల్ పామ్, మామిడి, కోకో తోటలను కూడా సాగు చేస్తారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. తొమ్మిది సార్లు పోటీ చేస్తే, ఆరు సార్లు తెలుగు దేశం జెండా ఎగిరింది.1985,1989,1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. సత్తుపల్లి నియోజక వర్గంలో అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని, పార్టీని బలోపేతం చేసి కంచుకోటగా మార్చారు తుమ్మల. ఆ తర్వాత సత్తుపల్లి నియోజక వర్గాల డీలిమిటేషన్ లో భాగంగా ఎస్సీ రిజర్వుడు అయ్యింది. దీంతో తుమ్మల ఖమ్మం నియోజక వర్గం నుండి పోటీ చేయాల్సి వచ్చింది.
ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మొదటిసారి సత్తుపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధి పోటీలో ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కూడా 2018 లో సత్తుపల్లిలో మహాకూటమి తరుపున టీడీపీ అభ్యర్ధి పోటీ చేశారు. 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా తొమ్మిది పర్యాయాలు టీడీపీ అభ్యర్దులు పోటీ ఉండి ఆరు పర్యాయాలు పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గత అన్ని ఎన్నికల్లో పలు స్థానాల్లో వామపక్షాలతో సీట్లు సర్దుబాట్లు గత ఎన్నికల్లో మహా కూటమితో పొత్తు తదితర కారణాలవల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాల్లో పలు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు.
టీడీపీ ప్రభావం..
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించడంతో సత్తుపల్లి నియోజకవర్గం మొదటిసారి టీడీపీ అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. గత 2018 ఎన్నికల్లో మహా కూటమి తరపున.. తెలుగుదేశం అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య 100,044 ఓట్లు సాధించి గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి 81,042 ఓట్లు సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా.. బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. సత్తుపల్లి నియోజక వర్గ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం టీడీపీ పోటీలో లేకపోవడంతో, ఆ పార్టీ ఓటు బ్యాంకు కీలకంగా మారింది. వారి మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో, ఆయన అరెస్ట్‌ను ముక్తకంఠంతో ఖండించింది సత్తుపల్లి నియోజకవర్గం. పెద్ద ఎత్తున చంద్రబాబుకు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో అన్ని పార్టీలు పాల్గొన్నారు. తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకుండా తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో. సత్తుపల్లిలో ఎవరు విజయం సాధిస్తారు. ఏ జెండా ఎగురుతుందన్నదీ ఆసక్తికరంగా మారింది. చూడాలి మరీ పసుపు తమ్ముళ్ళు ఎవరి వైపు నిలుస్తారన్నదీ.!
తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే వరుసగా మూడుసార్లు గెలుపొందారు. అంతకు ముందు ఒకసారి పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సండ్ర విజయం సాధించారు. గతంలో సండ్ర వెంకటవీరయ్య మీద పోటీ చేసి ఓడిపోయిన మట్టా దయానంద్ భార్య మట్టా రాగమయి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మరోసారి నంబూరి రామలింగేశ్వరరావు, సీపీఎం నుంచి మాచర్ల భారతి బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ లో ప్రస్తుతం కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంతూళ్లు కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉండడంతో వాళ్లిద్దరి ప్రభావం సండ్ర గెలుపోటములపై ఎఫెక్ట్ చూపే అవకాశముంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
