Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్

పల్లె ప్రగతిని ఆ ఊరి సర్పంచ్ పరుగులు పెట్టించాడు. ఊరికి వెలుగులు తెచ్చాడు. కానీ అదే పల్లె ప్రగతి ఆ ఊరి సర్పంచ్‌ జీవితంలోకి...

Telangana: పగలు సర్పంచ్.. రాత్రి సెక్యూరిటీ గార్డ్.. పాపం ఇరుసు మల్లేష్
Sarpanch As Security Guard
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2021 | 6:03 PM

పల్లె ప్రగతిని ఆ ఊరి సర్పంచ్ పరుగులు పెట్టించాడు. ఊరికి వెలుగులు తెచ్చాడు. కానీ అదే పల్లె ప్రగతి ఆ ఊరి సర్పంచ్‌ జీవితంలోకి మాత్రం చీకటిని తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పనుల కోసం సర్పంచ్ తెచ్చిన అప్పులు కుప్పలయ్యాయి. చివరికి కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక సెక్యూరిటీగా మారాడు. ఉదయం పూట సర్పంచ్‌గా ప్రజా సేవ చేస్తూనే.. రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా వర్క్ చేస్తున్నాడు. ఊరి రక్షకుడు.. ప్రైవేట్ కంపెనీలో కాపలాదారునిగా మారిన వైనంపై స్పెషల్ స్టోరీ.

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో చాలామంది బరిలోకి దిగారు. ఎక్కువమంది పోటీలో నిలిచినప్పటికీ.. గ్రామ పెద్దలు చీటీలు తీయగా ఇరుసు మల్లేష్ పేరు వచ్చింది. దీంతో అతడిని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు. సర్పంచ్ అయ్యేంతవరకు అంతా బానే ఉన్నా..ఆ తరువాతే అసలు కష్టాలు మొదలైయ్యాయి. పల్లె ప్రగతిలో భాగంగా గతంలో గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలానే ఉండిపోయాయి. చివరికు సర్పంచ్ అప్పుల పాలై తనకున్న రెండెకరాల్లో అర ఎకరం భూమిని అమ్ముకుని అప్పులన్నీ తీర్చేశాడు.

Irusu Mallesh

రాను రాను ఆర్దిక కష్టాలతో తన కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో ఉదయం అంతా ఆరెపల్లి గ్రామంలో సర్పంచ్‌గా సేవలందిస్తూ.. రాత్రుల్లు మాత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్‌లో నైట్ వాచ్‌మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

Irusu Mallesh 1

గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ గ్రామంలో కలిసి ఉండేది. 2018 లో ఆరెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం గ్రామ జనాభా 434 కాగా, గ్రామానికి నెలసరి ఎస్ఎఫ్‌సీ నిధులు రూ.37 వేల రూపాయలు జనాభా ప్రాతిపదికన వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాటు మంజూరైన కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వడంతోనే సరిపోతోందని సర్పంచ్ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడుదల విషయమై జిల్లా కలెక్టర్‌కు సర్పంచ్‌ మల్లేష్‌ పలు సార్లు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. కానీ ఇచ్చిన హామీ మాటలకే పరిమిత మైందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తనను ఆదుకోవాలని మల్లేష్ వేడుకుంటున్నాడు.

Also Read: ‘టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

పరిటాల సిద్ధార్థ్ వద్ద బుల్లెట్ కలకలం.. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని పోలీసుల డెడ్‌లైన్‌..