Watch: వేసిన మరుసటిరోజే.. పెచ్చులు, పెచ్చుగా ఊడోస్తున్న రోడ్డు.. ఎక్కడో తెలుసా?
గ్రామాల్లో రవాణ సౌకర్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్ల నాణ్యత లోపిస్తోంది. దీంతో నూతనంగా రహదారి నిర్మాణం చేస్తే నెలల వ్యవధిలోనే దెబ్బతిన్న సంఘటనలు అనేకం. మంజూరైన నిధుల్లో అరకొరగా ఖర్చు చేయడం నాసిరకంగా రహదారి నిర్మించడం పరిపాటిగా మారింది.

నాసిరకం రోడ్ల నిర్మాణానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది మహబూబ్ నగర్ జిల్లాలో బాలానగర్ మండలం బుడగుట్ట తండా, దేవుని తండా నూతన బీటీ రోడ్డు. దాదాపు ఒక కిలో మీటర్ బీటీ రోడ్డు నిర్మాణానికి ట్రైబల్ ఫండింగ్ ద్వారా కోటి రూపాయలు మంజూరు అయ్యాయి. దీంతో ఇటీవలె రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 19న సాయంత్రం బీటీ రోడ్డు వేయగా మరునాడు ఉదయానికి రోడ్డు బీటలుగా పైకి లేచింది. రోడ్డు నిర్మాణంలో నాణ్యత చర్యలు పాటించకపోవడం వల్లే రహదారి బీటలుగా ఊడి వస్తోందని గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం రోడ్డును చూపుతూ గ్రామస్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడం వైరల్ గా మారింది.
ఇక గ్రామస్థుల ఆరోపణలపై కాంట్రాక్టర్ స్పందించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే రోడ్డు పనులు చేస్తున్నామమని చెప్పారు. బుధవారం వేసిన బీటీ రోడ్డులో టర్నింగ్ ఉందని… అక్కడ డాంబర్ లిక్విడ్ అధికంగా పోయడం, రోలర్ సరిగ్గా రాలేదన్నారు. మిగతా రోడ్డు అంతా నాణ్యత ప్రమాణాలతోనే వేసినట్లు కాంట్రాక్టర్ చెబుతున్నారు.
ఏది ఏమైనా రోడ్డు నాణ్యతను చూసేసరికి ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురు చూస్తే ఇలాంటి నాసిరకం రోడ్డు వేశారని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తున్న కాంట్రాక్టర్, పర్యవేక్షించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డింమాడ్ చేస్తున్నారు. నాణ్యతతో కూడిన రహదారి వేస్తే పదికాలల పాటు పదిలంగా ఉంటుందని ఈ విధంగా నాసిరకంగా వేస్తే ఎవరికి ప్రయోజనం ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
