AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు నవజాత శిశువులు మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఏసీ, విద్యుత్తు లోపాలు, నిర్వహణ, అగ్నిమాపక భద్రత వంటి అంశాలపై కమిటీ దర్యాప్తు చేయనుంది.

రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..
Rims Adilabad Fire
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 9:24 AM

Share

ఆదిలాబాద్ రిమ్స్‌లోని SNCU వార్డులో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏసీ యూనిట్ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి.. అప్పటివరకు ప్రాణాల కోసం పోరాడుతున్న పసికందుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో వార్డులో 27 మంది నవజాత శిశువులు ఉండగా.. ఇప్పటివరకు ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం అస్వస్థతకు గురైన శిశువులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారుల్లో పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నాలుగు ప్రత్యేక వాహనాల్లో వారిని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించారు.

బేబీ ఆఫ్ మంజూష – శ్రీ లక్ష్మి నరసింహ ఆసుపత్రి నుంచి రెయిన్‌బో ఆసుపత్రికి

బేబీ ఆఫ్ మమత – శ్రీ లక్ష్మి ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు

బేబీ ఆఫ్ రహీమా బేగం – శ్రీ గణేష్ ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు

బేబీ ఆఫ్ సురేఖ – శ్రీ గణేష్ ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు

బేబీ ఆఫ్ మౌనిక – శ్రీ గణేష్ ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు

బేబీ ఆఫ్ స్వర్ణలత – సురేఖ ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు

బేబీ ఆఫ్ అజీమా – కేర్ ఆసుపత్రి నుంచి రెయిన్‌బోకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

రిమ్స్ ప్రమాదంపై ప్రభుత్వం సీరియస్

ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉట్నూరు ఐటీడీఏ పీవో మంద మకరంద్‌ను విచారణ కమిటీ చైర్మన్‌గా నియమించింది.

కమిటీలో: ఉట్నూరు ఏజెన్సీ వైద్యారోగ్యశాఖ అదనపు డీఎంహెచ్‌ఓ డా. కుడ్మెత మనోహర్, జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ సుభాష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం. భగవాన్ రెడ్డి, టీజీఎంఐడీసీ ఈఈ రాంకుమార్, విద్యుత్తు శాఖకు అనుబంధంగా ఉన్న ఎంఆర్టీ (మీటర్ రిలే టెస్టింగ్) డీఈ ప్రభాకరన్ సభ్యులుగా ఉన్నారు.

SNCUలో ఏసీ యూనిట్ పేలడానికి అసలు కారణమేంటి?, విద్యుత్తు లోపమా?, ఏసీ నిర్వహణలో నిర్లక్ష్యమా? లేదా సాంకేతిక లోపాలను ముందే గుర్తించలేదా..? ఈ అంశాలపై కమిటీ దృష్టి సారించనుంది.

ఎవరి తప్పిదం..? వ్యవస్థలో ఎక్కడ లోపం..?

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలోని నిర్వహణా విధానం, సాంకేతిక అంశాలు, విధుల నిర్వహణలో వ్యక్తుల పాత్ర, వ్యవస్థాపరమైన లోపాలు, ప్రమాద సమయంలో తీసుకున్న చర్యలు, బాధితుల వివరణలను కమిటీ పరిశీలించనుంది. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి? విద్యుత్తు, అగ్నిమాపక వ్యవస్థలు ఎలా ఉండాలి? అత్యవసర పరిస్థితుల్లో నవజాత శిశువులను ఎలా తరలించాలి? వంటి అంశాలపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఒకవైపు ప్రాణాలతో పోరాడుతున్న పసికందులు.. మరోవైపు హైదరాబాద్‌కు తరలింపుతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us