AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డీజిల్ పోస్తుండగా బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!

హైదరాబాద్ మీర్‌పేట్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ నింపుతుండగా ఓ బస్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సకాలంలో బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Hyderabad: డీజిల్ పోస్తుండగా బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
Hyderabad Bus Fire
Balaraju Goud
|

Updated on: Sep 24, 2026 | 7:59 AM

Share

హైదరాబాద్‌ మహానగరం మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గాయత్రి నగర్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద గురువారం (సెప్టెంబర్ 24) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు సకాలంలో అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన సుమారు 150 మంది గణేష్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలం బయలుదేరారు. మార్గమధ్యలో గాయత్రి నగర్‌ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద రెండు బస్సులకు డీజిల్‌ పోస్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న TS 15 T 8558 నంబర్‌ గల శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్‌ బస్సులో కుడివైపు ఇంజిన్‌ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలను గుర్తించిన డ్రైవర్‌ వెంటనే బస్సు నుంచి బయటకు వచ్చి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో ప్రయాణికులంతా సకాలంలో బస్సు నుంచి దిగిపోయారు. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. భారీగా ఆస్తినష్టం సంభవించింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన కారణంగా ప్రధాన రహదారిపై కొంతసేపు అప్రమత్తత నెలకొంది. వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు పోలీసులు చర్యలు చేపట్టారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై మీర్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చేయండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us