మార్కెట్‌లోకి వస్తున్న 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు, పూర్తి వివరాలు తెలిస్తే పిచ్చి పీక్స్
భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మోడళ్ల రాకకు రంగం సిద్ధమవుతోంది. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్, అల్ట్రావయోలెట్, హోండా నుంచి మూడు స్కూటర్లు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఒకటి సాధారణ రోజువారీ వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, మిగతా మోడళ్లు పనితీరు, అర్బన్ మొబిలిటీపై దృష్టి పెట్టనున్నాయి. ధరలు, ఫీచర్లు ఒక్కో మోడల్‌లో భిన్నంగా ఉండనున్నాయి. కొత్త స్కూటర్ల రాకతో కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న వేళ మూడు కొత్త స్కూటర్లు ఆసక్తిని పెంచుతున్నాయి. విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండగా, అల్ట్రావయోలెట్ తొలిసారి స్కూటర్‌ను తీసుకురానుంది. హోండా మాత్రం రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. డిజైన్, రేంజ్, ఛార్జింగ్, టెక్నాలజీ పరంగా ఈ మూడింటి మధ్య తేడాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి, మరికొన్ని ప్రస్తుతం అంచనాల దశలోనే ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ స్కూటర్‌లో స్పోర్టీ డిజైన్
భారత్‌లో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలోకి అడుగుపెట్టేందుకు వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సిద్ధమవుతోంది. దేశీయ సరఫరాదారులతో కలిసి భారతీయ అవసరాలకు తగ్గ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. సంస్థ విక్రయిస్తున్న వైపర్ ఆధారంగా భారత మార్కెట్ కోసం కొత్త మోడల్ రావచ్చని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన డిజైన్ పేటెంట్‌లో పెద్ద వీల్స్, మందపాటి టైర్లు, హబ్ మోటార్, స్పోర్టీ లుక్ కనిపిస్తున్నాయి. ట్విన్ పాడ్ హెడ్‌ల్యాంప్ కూడా ప్రత్యేకంగా ఉంది. అయితే పేటెంట్ పొందిన ఇదే మోడల్‌ను భారత్‌లో విడుదల చేస్తారా లేదా అనే విషయంపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
టెసరాక్ట్, QC3లో టెక్నాలజీ
అల్ట్రావయోలెట్ తొలిసారిగా స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో కనిపించే టెసరాక్ట్‌ను 2027 ఫస్ట్ క్వార్టర్‌లో భారత్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త 100V ఆర్కిటెక్చర్‌తో రూపొందుతున్న ఈ స్కూటర్‌లో వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన పనితీరుపై దృష్టి పెట్టారు. దీని ధర రూ.1.5 లక్షల లోపే ఉండొచ్చని అంచనా.
మరోవైపు హోండా QC3 రోజువారీ ప్రయాణాలకు అనువుగా రానుంది. ఇందులో 3 kWh బ్యాటరీ, సుమారు 150 కిలోమీటర్ల IDC రేంజ్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 80 శాతం ఛార్జింగ్‌కు దాదాపు 2 గంటల 40 నిమిషాలు పడుతుంది. సీటు కింద 32 లీటర్ల స్టోరేజ్, స్మార్ట్ కీ, కనెక్టెడ్ ఫీచర్లతో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్నాయి. ప్రారంభ ధరను హోండా ప్రకటించలేదు. మార్కెట్ అంచనాల ప్రకారం ఇది రూ.1.2 లక్షల వరకు ఉండొచ్చు.
