AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రైవేట్ విషయాలను పంచుకున్నాడు.. కట్ చేస్తే.. రూ.4.91 కోట్లు పోయాయ్..

డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులు ప్రైవేట్ చాట్స్‌, ఫొటోలతో బెదిరించడంతో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల లాయర్‌ ఏకంగా రూ.4.91 కోట్లు కోల్పోయాడు. 241 లావాదేవీల్లో డబ్బులు బదిలీ చేయడంతో పాటు ఫ్లాట్‌ను కూడా విక్రయించాడు. డేటింగ్ యాప్ యవ్వారం అసలు ఎలా మొదలైంది... ఎలా కనెక్ట్ అయ్యాడు.. అనే వివరాలను తెలుసుకుందాం..

డేటింగ్ యాప్‌లో పరిచయం.. ప్రైవేట్ విషయాలను పంచుకున్నాడు.. కట్ చేస్తే.. రూ.4.91 కోట్లు పోయాయ్..
Dating App Scam
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 9:12 AM

Share

డేటింగ్ యాప్‌లో ఓ చిన్న పరిచయం.. ఆ తర్వాత గంటల తరబడి చాటింగ్.. చివరకు అదే వ్యక్తిగత చాట్స్‌ను అడ్డుపెట్టుకుని బెదిరింపులు. హైదరాబాద్‌లో ఓ 27 ఏళ్ల లాయర్‌కు ఎదురైన ఈ సైబర్ మోసం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పరువు పోతుందనే భయంతో నిందితులు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లిన బాధితుడు.. చివరకు ఏకంగా రూ.4.91 కోట్లు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోవడంతో పాటు, తన ఫ్లాట్‌ను కూడా అమ్మేసి మరీ నిందితులకు నగదు బదిలీ చేయడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది.

డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మడం నుంచే ఈ వ్యవహారం మొదలైంది. తొలుత సాధారణంగా సాగిన చాటింగ్‌.. క్రమంగా వ్యక్తిగత విషయాలు, ప్రైవేట్ సంభాషణలు, వీడియో కాల్స్‌ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాధితుడి చాట్స్‌, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతామంటూ నిందితులు బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా తమకు అత్యవసరంగా డబ్బు అవసరమని, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు.

పరువు, కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే భయంతో బాధితుడు మొదట చిన్న మొత్తాల్లో డబ్బులు పంపడం ప్రారంభించాడు. అయితే డబ్బులు పంపిన కొద్దీ నిందితుల డిమాండ్లు మరింత పెరిగాయి. ఒక్కసారి చెల్లిస్తే సమస్య ముగుస్తుందని భావించిన బాధితుడికి.. ప్రతిసారీ కొత్త కారణాలు చెప్పి మరిన్ని డబ్బులు అడిగారు. ఇలా బెదిరింపులు, మానసిక ఒత్తిడి మధ్య బాధితుడు తన ఖాతాలతో పాటు కుటుంబ సభ్యుల ఖాతాల్లోని డబ్బును కూడా బదిలీ చేశాడు.

నిందితుల ఒత్తిడి ఆగకపోవడంతో చివరకు తన ఫ్లాట్‌ను విక్రయించి వచ్చిన మొత్తాన్ని కూడా వారికి పంపినట్లు సమాచారం. మొత్తం 241 లావాదేవీల్లో కోట్ల రూపాయలు బదిలీ చేసిన అనంతరం కూడా బెదిరింపులు కొనసాగడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను భారీ సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన ఆయన సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లావాదేవీల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, చాటింగ్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

డేటింగ్ యాప్‌లలో పరిచయమయ్యే వ్యక్తులపై పూర్తిగా నమ్మకం ఉంచకూడదని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా చాట్స్‌ లేదా ఫొటోల పేరుతో బెదిరిస్తే భయపడి డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us