AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యప్ప సన్నిధిలో అపచారం.. బంగారు కిరీటం మాయం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు కిరీటం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అసలు 445 గ్రాముల కిరీటం స్థానంలో 240 గ్రాముల నకిలీ కిరీటం లభ్యం కావడంతో అనుమానాలు బలపడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన తనిఖీల్లో ఈ వ్యత్యాసం బయటపడింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు దీనిపై విచారణకు ఆదేశించింది, నిఘా కెమెరాలు లేకపోవడం దర్యాప్తును మరింత సంక్లిష్టం చేస్తోంది.

అయ్యప్ప సన్నిధిలో అపచారం.. బంగారు కిరీటం మాయం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
Sabarimala Gold Crown Mystery
Balaraju Goud
|

Updated on: Sep 24, 2026 | 9:02 AM

Share

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చెందిన విలువైన బంగారు కిరీటం విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సన్నిధానంలోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అసలు బంగారు కిరీటం స్థానంలో అదే నమూనాలో ఉన్న మరో కిరీటం కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు విచారణకు ఆదేశించింది.

2012 ఆగస్టులో తమిళనాడుకు చెందిన భక్తులు శబరిమల అయ్యప్ప స్వామికి ఈ బంగారు కిరీటాన్ని సమర్పించారు. అధికారిక పత్రాల ప్రకారం దాని బరువు 445.78 గ్రాములుగా నమోదైంది. అయితే ఇటీవల విలువైన వస్తువుల తనిఖీలో స్ట్రాంగ్ రూమ్‌లో లభించిన కిరీటం బరువు సుమారు 240 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అసలు కిరీటాన్ని వేరే కిరీటంతో మార్చారా అనే అనుమానాలు తలెత్తాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో విలువైన వస్తువుల జాబితా తయారీ, తనిఖీలు చేపట్టిన సమయంలో ఈ వ్యత్యాసం బయటపడింది. స్ట్రాంగ్ రూమ్‌లో నిఘా కెమెరాలు లేకపోవడం కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారింది. అలాగే, ఆదేశాల ప్రకారం కిరీటాన్ని ఆరన్ములలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

శబరిమలతో పాటు ఇతర ఆలయాల్లో నిర్వహించిన తనిఖీల్లోనూ పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న నాలుగు పవన్‌ల బంగారు హారం, తిరువనంతపురంలోని ఓ ఆలయానికి చెందిన వెండి అలంకరణ వస్తువులు కనిపించకపోవడం కూడా పరిశీలనలోకి వచ్చింది.

అయితే కిరీటం మిస్సింగ్ కాలేదని దేవస్థానం కమిషనర్ చెబుతున్నారు. మరోవైపు తనిఖీ సమయంలో అసలు కిరీటం స్ట్రాంగ్ రూమ్‌లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పత్రాలు, వస్తువుల బదిలీ రికార్డులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు.. కిరీటం ఎప్పుడు, ఎలా మారిందనే విషయాన్ని దర్యాప్తులో తేల్చనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us