ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు పిటిషన్‌పై నేడు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ!
ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. 2023లో BRS నుండి గెలిచి 2024లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినందున హైకోర్టు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. దానం తన అనర్హతకు రాజ్యాంగపరమైన నిబంధనలు లేవని వాదించారు. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు కేసుపై నేడు సుప్రీంకోర్టు లో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరపనుంది.
సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినందుకు పదో షెడ్యూల్ కింద అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్ సీటును ఖాళీగా ప్రకటించింది హైకోర్టు. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచే వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది.
దానం నాగేందర్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించే అవకాశం ఉంది.
దానం పిటిషన్‌లో కీలక వాదనలు
ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసినంత మాత్రాన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు కాదని దీనికి రాజ్యాంగపరమైన లేదా చట్టబద్ధమైన నిషేధం ఏమీ లేదని దానం నాగేందర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానని పార్టీకి రాజీనామా చేయలేదని, పార్టీ నుంచి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోలేదని పార్టీ నేతగా ఫీజు చెల్లిస్తున్నానని విప్‌లను పాటిస్తున్నానని పేర్కొన్నారు. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ బలం 38 మంది అని ప్రకటించారని స్పీకర్ ఇచ్చిన సమగ్ర తీర్పును సరిగ్గా సమీక్షించకుండా హైకోర్టు అనర్హత వేటు వేయడం తప్పన్నారు. ఆర్టికల్ 226 కింద స్పీకర్ ఉత్తర్వులను విస్తృతంగా సమీక్షించే అధికారం హైకోర్టుకు లేదన్నారు. మహాచంద్ర ప్రసాద్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆటోమేటిక్‌గా వర్తింపజేయడం సరికాదని ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా చూడాలన్నారు.. తన కేసు భిన్నమైనదనీ పిటిషన్ లో పేర్కొన్నారు.
దానం నాగేందర్ అనర్హత వేటు పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు తీర్పును యధావిధిగా కొనసాగించాలని.. దానం నాగేందర్ పిటిషన్ కొట్టివేయాలని కోరనున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా..? ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయా..? లేక దానం నాగేందర్ కి సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా అన్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
