Telangana: తండ్రిని పట్టించుకోని కొడుకులకు జలక్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కన్నతండ్రి పట్ల కొడుకులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో వారికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు అధికారులు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పట్టించుకోవట్లేదంటూ కొడుకుకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని సిరిసిల్ల ఆర్డీవో రద్దు చేశారు.
“అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కారు” అన్న సామెతను కొందరు ప్రబుద్ధులు నిజం చేస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని ఘటనలను ఎన్నో చూశాం.. ఈక్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కన్నతండ్రి పట్ల కొడుకులు కఠినంగా ప్రవర్తించారు. దీంతో వారికి దిమ్మతిరిగేలా షాకిచ్చారు అధికారులు. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పట్టించుకోవట్లేదంటూ కొడుకుకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని సిరిసిల్ల ఆర్డీవో రద్దు చేశారు.
తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్‌లో తండ్రిని పోషించకుండా, ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఇద్దరు కొడుకులకు సిరిసిల్ల ఆర్డీవో లోలావర్ రమేశ్ షాకిచ్చారు.గత ప్రభుత్వంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇంటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ఆ ఇంటిని తండ్రికి ఇవ్వాలని కొడుకులకు గురువారం నోటీసులు జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు అనిల్ కుమార్, సురేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. ఇల్లు రాజమల్లు పేరున ఇవ్వాల్సి ఉండగా పెద్దకొడుకు అనిల్ కుమార్ తన భార్య పేరిట రాయించుకున్నాడు.
గత ఆరు నెలల నుంచి రాజమల్లును కొడుకులు పట్టించుకోకపోవడంతో దీంతో ఆయన రోడ్లపైనే ఉంటూ భిక్షాటన చేసి కడుపునింపుకుంటున్నాడు. ఈ క్రమంలో తనను కొడుకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆర్డీవోకు మొరపెట్టుకున్నాడు. దీంతో తంగల్లపల్లి ఎమ్మార్వోకు పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో రమేశ్ ఆదేశించారు.
తంగళ్లపల్లి తహసీల్దార్ దీనిపై విచారించి కొడుకులు వృద్ధుడైన రాజమల్లును పట్టించుకోవడం లేదని నివేదించారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్న పెద్ద కొడుకును వారం రోజుల్లో ఖాళీ చేసి, తండ్రికి అప్పగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు కొడుకులు ఇద్దరూ ప్రతినెల తండ్రికి రూ.2 వేల చొప్పున చెల్లించాలని ఆర్డీవో ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని తహసీల్దారుకు సూచించారు.
దీంతో రాజమల్లు పెద్దకొడుకు అనిల్ కుమార్‌కు రెవిన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన అధికారులకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో లోలావర్ రమేష్ అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..