Telangana politics: మంత్రి పదవులు ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో కీలక పదవులు
అజారుద్దీన్ ప్రమాణస్వీకారంతో తెలంగాణ కేబినెట్‌లో మంత్రుల 16కి చేరింది. అదే సమయంలో మంత్రివర్గ బెర్త్ కోసం ఆశపడ్డ నేతలకు రేవంత్ సర్కార్ కీలక ఆఫర్లు ఇచ్చింది. సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదా పదవులు కట్టబెట్టగా.. ఇంకా ఇద్దరు మంత్రుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలకు ఇతర పదవులను కట్టబెట్టంది. సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావుకు కేబినెట్ హోదా పదవులు కట్టబెట్టింది. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు బాధ్యతను సుదర్శన్ రెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఇప్పటి నుంచి ఈ పథకాల అమలును సుదర్శన్ రెడ్డి సమీక్షించనున్నారు. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆరు గ్యారంటీల అమలును ఆయన పర్యవేక్షించనున్నారు. ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్ రావును నియమించింది సర్కార్. గతంలో మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది.

Premsagar Rao -Sudarshan Reddy
రేవంత్ సర్కార్ నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అజారుద్దీన్‌తో కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య 16కు చేరుకుంది. కేబినెట్‌లో మరో ఇద్దరికి ఇంకా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఛాన్స్ ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు రేవంత్ సర్కార్ ఆఫర్ చేసిన పదవులను స్వీకరిస్తారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
వీరి సంగతి ఇలా ఉంటే.. కేబినెట్ బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ ఆలోచన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తమకు కచ్చితంగా కేబినెట్ బెర్తులు కావాల్సిందే అని ఈ ఇద్దరు నేతలు అనేకసార్లు కుండబద్ధలు కొట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో ఎప్పటికప్పుడు తన మనోగతాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్, రంగారెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక మంత్రివర్గంలో బెర్త్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. తనకు మంత్రి రాకపోవడం వల్లే ఆమె యాక్టివ్‌గా ఉండటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు కీలకమైన మున్నూరు కాపు కోటా, యాదవ కోటాలో ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య వంటి వాళ్లు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో బ్యాలెన్స్ ఉన్న ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




