CM Revanth Reddy: అందరిచూపు సీఎం రేవంత్ రెడ్డి వైపే.. జూబ్లీ గెలుపుతో కాంగ్రెస్ థింక్ ట్యాంక్ టీమ్‌లోకి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు అనూహ్య విజయాన్ని అందించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠ ఢిల్లీలో బాగా పెరిగింది. బిహార్‌లో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు రాకపోవడం, మరోవైపు తెలంగాణలో రేవంత్ చూపిన నాయకత్వం ఈ రెండూ కలిసి ఆయనపై హైకమాండ్ విశ్వాసాన్ని మరింత పెంచినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఎన్నికలకు వ్యూహాల రూపకల్పనలో కీలకంగా పనిచేసే కేంద్ర స్థాయి మేధోబృందంలో రేవంత్‌కు చోటు కల్పించాలన్న ఆలోచన అధిష్ఠానంలో నెలకొన్నట్లు సమాచారం.

బిహార్‌లో ప్రచారం జోరుగా జరిగినప్పటికీ కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో జూబ్లీహిల్స్‌లో సిట్టింగ్ స్థానాన్ని, సానుభూతి ని అధిగమించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం రేవంత్ నాయకత్వానికి పెద్ద మద్దతుగా నిలిచింది. తెలంగాణ, కర్ణాటకలో బీజేపీ బలపడే అవకాశాలను అధిష్ఠానం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్న సమయంలో, ఈ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ పాత్ర కీలకమని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఢిల్లీలో మళ్లీ రివ్యూ
బిహార్‌లో అభ్యర్థుల ఎంపిక నుంచి పొత్తుల వరకు బాధ్యతలను అనుభవంలేని వ్యక్తులకు అప్పగించడం వల్ల జరిగిన నష్టాన్ని హైకమాండ్ గుర్తించినట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కిందిస్థాయి కార్యకర్తలతో అనుసంధానం లేకపోవడం, ముఖ్యమంత్రిని కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు రావడం, మీడియా సంబంధాలు బలహీనంగా ఉండటం వంటి ఫిర్యాదులు ఢిల్లీలో చర్చకు వచ్చాయి. దీనితో, వచ్చే ఎన్నికల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని పనిచేయగల నాయకులు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛ – పార్టీ ఐక్యతకు గుర్తింపు
చివరి పది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రేవంత్ చేసిన సమన్వయం ఢిల్లీ పెద్దలను ఆకట్టుకుంది. తెలంగాణలో ఉత్తమ్, భట్టి, మహేశ్ గౌడ్ వంటి ప్రముఖ నేతలను ఒకే దిశలో నడిపించగలిగిన ఆయన సామర్థ్యాన్ని హైకమాండ్ సానుకూలంగా చూస్తోంది. భవిష్యత్తు స్థానిక ఎన్నికల నుంచి కీలక రాజకీయ నిర్ణయాల వరకు రేవంత్‌కు మరింత స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశవ్యాప్త వ్యూహాల్లో రేవంత్ పాత్ర..!
బీజేపీకి వ్యతిరేకంగా వ్యూహాలను అమలు చేసే నాయకుడు కాంగ్రెస్‌లో అవసరమన్న అభిప్రాయం పెరుగుతోంది. అమిత్ షా తరహా రాజకీయ కసితో జాతీయ స్థాయి వ్యూహాలు రూపొందించే బృందంలో కొత్త వ్యక్తులను తీసుకురావాలని ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ను థింక్ ట్యాంక్‌లో భాగం చేయాలనే ఆలోచన ఢిల్లీ నేతల్లో బలపడినట్లు తెలుస్తోంది.
తమ రాష్ట్రంలో పార్టీని తిరిగి ఉత్సాహపరిచిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు మార్గదర్శకుడిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. బిహార్ దెబ్బతో దిగులుగా ఉన్న కాంగ్రెస్‌కు, తెలంగాణ మంత్రి వర్గం నుంచి వచ్చిన ఈ విజయం కొత్త దిశను చూపినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
