AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..

తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజున నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి, మొత్తం 6,87,677 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో జరిగింది. రైతులు, కూలీలు, గూడు లేని పేదలందరికీ న్యాయం చేసేలా ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేసింది.

Telangana: రేవంత్ సర్కార్ భరోసా.. మార్చి 31 వరకు పథకాల జాతరే.. ఇవాళ కీలక సమీక్ష..
Revanth Reddy
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 11:37 AM

Share

గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు పథకాలు ప్రారంభించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకాలతో తొలి రోజే 6 లక్షల 15 వేల 677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ.579 కోట్లు విడుదల చేసింది.

మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది ప్రభుత్వం. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.

తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.

అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేసింది ప్రభుత్వం. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి రోజునే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 72 వేల మంది పేదలకు ఇళ్ల పత్రాలను అందించింది.

పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం రేవంత్

మరోవైపు ఈ పథకాల అమలు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. మార్చి 31వరకు పథకాలకు సంబంధించిన కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించిన సీఎం రేవంత్.. అర్హులైన వాళ్లందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలిపారు. ఈ క్రమంలో పథకాల అమలు జరుగుతున్న తీరుపై సమీక్ష నిర్వహించి అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..