Rakhi Festival 2022: చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుతో రాఖి కట్టిన అక్కకు తులాభారం..
Rakhi Festival 2022: రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఓ ఆత్మీయ పండుగ.
Rakhi Festival 2022: రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమకు నిదర్శనంగా ఉండే ఓ ఆత్మీయ పండుగ. ఈ రాఖీ పూర్ణిమ పండగ తన అక్కకు జీవితాంతం గుర్తు ఉండాలని తలిచాడు ఓ తమ్ముడు. అనుకున్నదే తడువుగా తను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బుతో రాఖి పండుగ సందర్బంగా తనకు రాఖి కట్టిన అక్కకు తులాభారం చేశాడో ఆ తమ్ముడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌కు చెందిన బోలగాని బసవ నారాయణ, అరుణ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు వారు రణశ్రీ,త్రివేది. రణశ్రీకి గత సంవత్సరం వివాహం చేశారు తల్లిదండ్రులు. వివాహమైన తర్వాత మొదటిసారిగా వస్తున్న రాఖీ పూర్ణిమ పండుగను తన అక్కకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేయాలనుకున్నాడు తమ్ముడు త్రీవేది. తన అక్కపై ఉన్న ప్రేమతో తాను చిన్నతనం నుంచి దాచుకున్న డబ్బును అయిదు రూపాయల కాయిన్లుగా మార్చి అక్కకు తులాభారం నిర్వహించాడు.
తులాభారంలో సుమారు 11,200.. ఐదు రూపాయల కాయిన్స్ తూకంగా వచ్చాయి, వాటి విలువ సుమారు 56 వేల రూపాయలు. వీటిని కానుకగా ఇచ్చాడు. ఈ తులాభారం వేడుకను బందువులు, స్నేహితులను పిలిపించుకొని ఘనంగా నిర్వహించుకున్నారు కుటుంబ సభ్యులు. తన అక్కకు ఇలా తులబారం నిర్వహించడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు త్రివేది. తన తమ్ముడు చేసిన ఈ తులాభారం పట్ల అక్క రణశ్రీ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని సంతోషం వ్యక్తం చేసింది. తన కొడుకు అక్క పై ఇంత అభిమానాన్ని చూపడం పట్ల తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.