Telangana Rains: ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో.. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలీని స్థితి. భయం గుప్పిట్లో తెలంగాణం

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి

Telangana Rains: ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో.. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలీని స్థితి. భయం గుప్పిట్లో తెలంగాణం
Tractor In Floods
Follow us

|

Updated on: Aug 31, 2021 | 9:39 AM

Telangana Fluds: తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. మళ్లీ సేఫ్‌గా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం కనిపించడం లేదు. అనేక ప్రాంతాల్లో రోడ్ల పై నుంచి ప్రవహిస్తోంది నీరు. దీంతో చాలా చోట్ల నీటి మధ్యలోనే నిలిచిపోయాయి వాహనాలు.

ఎటు వైపు నుంచి ఏ ప్రవాహం వస్తుందో తెలియదు. ఎక్కడ ఏ వాగు ఉప్పొంగుతుందో తెలియదు. ఎటు చూసినా.. నీరే. చిన్న కాల్వ నుంచి పెద్ద వాగు వరకు.. అంతా జలమయం. ఉప్పొంగుతున్న కాల్వలు.. ఎగిసిపడుతున్న వాగులు. యాదాద్రి జిల్లా రాజపేట మండలం దోసలవాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఇటికలపల్లి వెళ్లి తిరిగి కుర్రరాం వెళ్తుండగా వాగులో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయారు. యువతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, స్థానికులు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రైవర్ అత్యుత్సాహం ప్రయాణికుల ప్రాణాల మీదకు వచ్చింది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. గంభీరావుపేట మండలం లింగంపేట వాగు బ్రిడ్జ్‌పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అయినా సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును బ్రిడ్జి మీద నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బస్సును ముందుకు తీసుకెళ్లలేక నీటిలోనే నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులందరూ లబోదిబోమనగా..అక్కడే ఉన్న స్థానికులు ఒక్కొక్కరిగా ఒడ్డుకు చేర్చారు. ప్రయాణికులు వద్దని వారించినా ఆర్టీసీ డ్రైవర్ వినకుండా ప్రవహిస్తున్న నదిలో నుంచి తీసుకెళ్లేందుకు యత్నించాడు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఊరి చివర్లో మత్తడి వద్ద నీటి ప్రవాహం ఎక్కువ ఉంది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన భూపతి రెడ్డి బైక్‌పై వెళ్తుండగా కొట్టుకుపోయి మత్తడి మధ్యలో పడిపోయాడు. బైక్‌తో పాటు వ్యక్తి పడిపోవడంతో అక్కడే ఉన్న ముదిరాజ్ కులస్తులు వ్యక్తిని బయటకు తీశారు. పడిపోయిన వ్యక్తిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

నాగర్ కర్నూలు జిల్లా దుందుభి వాగులో చిక్కుకుపోయింది ట్రాక్టర్. అతి కష్టం మీద మరో ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు చేర్చారు గ్రామస్థులు. అదృష్టవశాత్తు ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఆరుగురు క్షేమంగా బయటపడ్డారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దుందుబి నది వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రామగిరి నుంచి రఘుపతి పేటకు వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు వాగులో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానికులు.. బయటకు తీశారు.

రామగిరి-రఘుపతి పేట వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవని అంటున్నారు. అయినా.. డిమాండ్లకు హామీలు లభించకపోవడంతో.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ మొత్తం అతలాకుతలం అవుతోంది. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భైంసా మండలం మహాగామ్ – గుండెగావ్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కుబీర్ మండల కేంద్రంలో భారీ వర్షంతో వరద నీరి ఇళ్లలోకి చేరింది. మేదరి గల్లీలో వరద నీటిలో చిక్కుకున్న 8 మందిని పోలీసులు కాపాడారు. కుబీర్ ముంపు వాసులకు గ్రామ పంచాయితీ కార్యాలయంలో తాత్కాలికంగా పునరావాసం కల్పించారు పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది. అర్థరాత్రి వరదలో చిక్కుకున్న ఓ ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు తీశారు పోలీసులు. ఇక సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతలి వైపు ఉన్న గ్రామాలైన అక్కెనపల్లి, ఘనపూర్, ఖాతా, గట్లమల్యాల, కొండంరాజ్ పల్లితో పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా రద్దయ్యాయి.

రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షంతో జనగాం జిల్లా తడిసి ముద్దయింది. పట్టణంలో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై నీరు చేరింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింద. జిల్లాలో పాలకుర్తి, దేవరుప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, జనగామ మండలంలో వర్షం పడుతోంది. చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులన్నీ మత్తుడి దుంకుతున్నాయి.

Read also:  Tigers: పెద్ద పులుల గాండ్రింపులతో గుండెలదిరిపోతున్నాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఒకటే భయం