ఈ నియోజకవర్గంలో అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్దమైన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు..

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అస్త్రశస్త్రాలతో ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ నియోజకవర్గంలో అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్దమైన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు..
Brs Bjp Congress

Edited By: Srikar T

Updated on: Apr 15, 2024 | 11:09 AM

రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అస్త్రశస్త్రాలతో ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ల నేతల మాటల తూటాలు పేలుతుండడంతో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతోనే కరువు వచ్చిందని బిఆర్ఎస్ విమర్శిస్తోంది. గత పదేళ్లలో రాష్ట్రాన్ని బిఆర్ఎస్ నేతలు దోచుకుని దివాలా తీయించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో కాంగ్రెస్‌..

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్‌.. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా వ్యూహరచన చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ రెండు సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్‌..ప్రస్తుత అధికారంలో ఉన్న నేపథ్యంలో రెండింటిలోనూ గెలుపు ధీమాతో ప్రజల్లోకి వెళ్తోంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 సీట్లు కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. సంస్థాగతంగా బలంగా ఉండటం, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం పార్టీ ప్రచారంలో జోరందుకుంది. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. నల్గొండలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు అభ్యర్థి రఘువీర్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు చేసి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక భువనగిరిలో ఎన్నికల గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాలు జరుగుతున్నాయి. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అదే రోజు భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి‎తో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, గత బీఆర్ఎస్, మోడీ సర్కార్ విధానాలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

రేవంత్ సర్కార్ వైఫల్యాలే ప్రధాన ఏజెండాగా బీఆర్ఎస్..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీష్ రెడ్డిలు క్యాడర్‎కు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కరవుతో పాటూ కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని క్షేత్రస్థాయిలో వివరిస్తూ బీఆర్ఎస్ విమర్శల దాడిని పెంచుతోంది. నల్గొండలో పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఈనెల 23న, భువనగిరిలో అభ్యర్థి క్యామ మల్లేశ్‌ ఈ నెల 22న నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు లోక్‌సభ స్థానాల్లోనూ గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టనున్న బస్సుయాత్రకు కార్యాచరణను రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మోదీ పాలనను వివరిస్తూ బీజేపీ..

ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మడి జిల్లాలో పాగా వేయాలని బిజెపి ఉవ్విళ్లూరుతోంది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తోంది. నల్లగొండలో పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.. ఈనెల 22వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. భువనగిరిలో పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కూడా ఈనెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. రెండు స్థానాల్లో నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్‎లపై విమర్శలు దాడి చేస్తోంది. చౌటుప్పల్‎లో ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పదేళ్ల మోదీ పాలనను వివరిస్తూ మండలాలు, గ్రామాల వారీగా ముమ్మర ప్రచారం చేయాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..