Telangana: 1..4..3. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడిదో ఇంట్రెస్టింగ్ నెంబర్
సార్.. నా గురించి మీకు తెల్సు. నా ట్రాక్ రికార్డ్ కూడా తెల్సు. కాస్త సిఫార్సు చేసి పెట్టండి. చాలా మేలు చేసినవాళ్లు అవుతారు.. పొద్దున్నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులకు పోలీసు అధికారులు నుంచి వస్తున్న రిక్వెస్టులు ఇవి..

1..4..3. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడిదో ఇంట్రెస్టింగ్ నెంబర్. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో 143 పోలీస్ స్టేషన్‌లకు సంబంధించి ఆ ఆసక్తిరకమైన అంశం ఒకటి బయటకు వచ్చింది. పోలీస్ కమిషనరేట్లకు, ఎస్పీ కార్యాలయాలకు సిఫార్సు లేఖలు పోటెత్తుతున్నాయి. సీఐల బదిలీలు, నియామకాల కోసం లేఖలు పంపుతున్నారు ప్రజాప్రతినిధులు. పనితీరు బాగున్న వ్యక్తి, మాకు కావాలంటూ లేఖల్లో పేర్కొంటున్నారు. ఉదయమే పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లకు క్యూ కట్టారు సీఐ స్థాయి పోలీసులు. సిఫార్సు లేఖలతో అక్కడి నుంచి కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్‌లకు పరుగులు తీస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 6వందల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో 143చోట్ల పనిచేస్తున్న సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1996, 98 బ్యాచ్‌లకు చెందిన ఈ సీఐలంతా డీఎస్పీలుగా వెళ్లిపోతే ఆ 143చోట్ల సీఐల పోస్ట్‌లు ఖాళీ అవుతాయి. రాత్రి ఇచ్చిన ప్రమోషన్లతో ఖాళీ అయిన 143చోట్ల పోస్టింగ్‌ల కోసం, ఉదయానికల్లా కొందరు పోలీసులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. కావాల్సిన ఏరియాలు చెప్పి అక్కడికి బదిలీ చేసేలా సిఫార్సు లేఖలు అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది లేఖలు తీసుకుని ఆయా కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు కూడా పోటెత్తారు.
ఎమ్మెల్యేలు అందరి నుంచీ దాదాపు ఒకే తరహా ఫార్మాట్‌లో సిఫార్సు లేఖలు అందుతున్నాయి. అందులో ఏముందంటే.. (– The Said Officer Is Well Known To Me. His Work Extraordinary. His Performance is very Good. His Services Required To Our Constituency. Hence Please Consider The Request And Give Posting as per my Pleasure). ఈ అధికారి నాకు బాగా తెలుసు. మంచి పనితీరు ఉన్న వ్యక్తి. అతని సేవలు మా నియోజకవర్గానికి కావాలి. కాబట్టి మా కోసం అతన్ని మా ఏరియాలో పోస్టింగ్ ఇవ్వండి అన్నది ఆ లేఖలో సారాంశం. ప్రజాప్రతినిధులు పంపుతున్న ఈ సిఫార్సు లేఖల్లో ఉన్న కంటెంట్ టీవీ9 చేతికి చిక్కింది.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.