Telangana: ‘బిడ్డకు బాగోలేదన్నా వినలేదు’.. పసిగుడ్డు ప్రాణం తీసిన ఖాకీల కర్కశత్వం
పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీలు జాలి చూపలేదు. దీంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఖాకీల కర్కశత్వం 3 నెలల పసికందు ప్రాణాన్ని బలిగొంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి ప్రాణాలను లెక్కచేయకుండా.. క్యాబ్ డ్రైవర్‌ను వేధింపులకు గురి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యానికి గురైన బాలుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. చలానా వసూలు కోసం పోలీసులు గంట సేపు కారు ఆపారు. వైద్యం ఆలస్యమై ఆ బాలుడు మృతిచెందాడు. యాదగిరిగుట్ట మండలం( Yadagirigutta Mandal) వంగపల్లి(Vangapally) గ్రామం శివారులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… జనగామ జిల్లా(jangaon district) జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతుల మూడు నెలల వయస్సున్న కొడుకు రేవంత్ అనారోగ్యానికి గురవడంతో మంగళవారం జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. బాలుడిని అద్దె కారులో రాజధానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ శివారులో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు వాహన చలాన్ల తనిఖీల్లో భాగంగా వాహనాన్ని ఆపారు. కారుపై 1000 రూపాయల చలానా ఉందని.. వెళ్లి మీ సేవలో కడితేనే పంపిస్తామంటూ హుకుం జారీ చేశారు పోలీసులు.
మూడు నెలల చిన్నారికి అత్యవసర వైద్యం కోసం వెళ్తున్నామని చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చలాన్ చెల్లింపునకు అరగంట సమయం పట్టిందని డ్రైవర్ తెలిపారు. హైదరాబాద్ శివారుకు చేరుకోగానే బాలుడిలో కదలికలు లేవని, ఆసుపత్రికి తీసుకెళ్లాక.. వైద్యులు చూసి బాబు చనిపోయి అరగంట అవుతుందని నిర్ధారించారని బాధితులు తెలిపారు. సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఉంటే బాబు బతికేవాడని తల్లి కన్నీరు మున్నీరయ్యారు. కాగా ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఓ బాబు పుట్టి.. రెండు నెలల తర్వాత చనిపోయాడట. రెండో కుమారుడు కూడా ఇప్పుడిలా మరణించడంతో ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. అయితే బాలుడిని ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తమకు చెప్పలేదని యాదాద్రి సీఐ చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
