Telangana: ఇంజక్షన్ హత్య కేసు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు.. ఆ రెండూ ఒకటి కావా..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సూది మందు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన సూది మందు హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ఇప్పటికే రెండు జరగడంతో పోలీసులు వీటిని సవాల్ గా తీసుకున్నారు. అణువణువూ వెదుకుతూ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. రెండు హత్య కేసుల్లో ఉపయోగించిన ఇంజక్షన్లు ఒకే ఆస్పత్రి నుంచి తీసుకెళ్లినట్లు మొదట భావించారు. కానీ ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేపట్టగా ఒకటి కాదు రెండు ఆస్పత్రుల నుంచి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. సూది మందు సరఫరాపై నిజానిజాలు తెలుసుకునేందుకు మూడు రోజులుగా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు విచారణ చేపట్టగా.. ఆ దర్యాప్తులోనూ ఆసక్తికర విషయాలు బహిర్గతమవుతున్నాయి. వీటని ఓ నివేదికలో రూపొందించి.. ఆ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. కాగా.. ఇంజక్షన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా.. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్, ఇమాంబీ దంపతులు. అదే మండలంలోని నామవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావుతో ఇమాంబీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలిసినప్పటి నుంచీ ఇమాంబీ అతనిపై కక్ష పెంచుకుంది. అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని భావించింది. పక్కాగా భర్త హత్యకు ప్లాన్ వేసింది. స్థానికంగా ఆర్‌ఎంపీ వైద్యుడి సాయంతో ఖమ్మంలోని ఓ మందుల దుకాణంలో అధిక మోతాదులో మత్తు ఉండే కెమికల్ ను కొనుగోలు చేశారు. పలుమార్లు భర్తపై హత్యాప్రయోగం చేయాలనుకున్నా కొన్నిసార్లు వీలు కాలేదు. దీంతో జమాల్‌ను చంపేయాలని మోహన్ రావుపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇంజక్షన్‌ను వెంకటేశ్ ద్వారా ఆయనకు చేరవేసింది. ఈ నెల 19 న ఉదయం బొప్పారం నుంచి గండ్రాయికి జమాల్ బైక్ పై వెళ్తుండగా.. ముదిగొండ మండలం వల్లభి సమీపంలోకి రాగానే ఆర్‌ఎంపీ వెంకట్ బైక్‌పై లిఫ్ట్ ఇవ్వాలని కోరాడు. తర్వాత కాసేపటికే జమాల్‌కు వెంకట్ ఇంజక్షన్ గుచ్చి పారిపోతాడు. తనకు ఎవరో వెనుక నుంచి ఇంజిక్షన్ గుచ్చి పారిపోయారని స్థానికులకు జమాల్ చెప్పిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనను సవాల్ గా తీసుకున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణువారియర్ వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కేసు విచారణలో భాగంగా కుటుంబసభ్యులపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఇమాంబీ సెల్ ఫోన్ కాల్ డేటాను సేకరించారు. హత్య కేసులో ప్రధాన పాత్రదారులుగా మోహన్ రావు, వెంకటేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారుర. ఈ హత్యకు ప్రధాన సూత్రదారి ఇమాంబీ అని నిర్దరణకు వచ్చి, మంగళవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎనస్తీషియాకు ఇచ్చే రసాయనం అధిక మోతాదులో ఇవ్వడం వల్ల జమాల్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాకు చెందిన భిక్షం, విజయకుమారి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. విజయకుమారి పిల్లలు లేరని అదే జిల్లా బయ్యారం మండలం జగ్గుతండాకు చెందిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. నవీన 2020 జులై 4న ఆడ పిల్లకు, 2022 జులై 30న ఆమె రెండో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… వారం రోజుల తర్వాత వార్డులో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజీలో భిక్షం నవీన చేయి పట్టుకోవడం, సూదిమందు గుచ్చుతున్నట్లు దృశ్యాలు కనిపించాయి. మృతురాలి తల్లి ఈనెల 1న తన అల్లుడిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..