Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..
రక్షణ కల్పించడంలోనే కాదు.. అన్ని కష్టాల్లో మీ వెంట ఉంటామంటున్నారు అక్కడి పోలీసులు. వరదలకు ఏరులన్నీ ఊళ్లను ముంచెత్తితే.. చేయి అందించి సాయం చేస్తున్నారు.
రక్షణ కల్పించడంలోనే కాదు.. అన్ని కష్టాల్లో మీ వెంట ఉంటామంటున్నారు అక్కడి పోలీసులు. వరదలకు ఏరులన్నీ ఊళ్లను ముంచెత్తితే.. చేయి అందించి సాయం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా పోలీసులు? ఓ వైపు గ్రామాల్లోకి వరదలు, మరో వైపు రోడ్లపై ఉప్పొంగుతున్న వాగులు. రెండు మండలాలను అష్టదిగ్బందం చేయడంతో వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సమయస్పూర్తితో వాగులు దాటించారు పోలీసులు. రెండు రోజులుగా వానలు వదలడం లేదు. దీంతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఊరూవాడలు వరదలతో ఉప్పొంగుతున్నాయి.
మహబూబబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది. ప్రతీ గ్రామంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సిఐ రాజిరెడ్డి, ఎస్సై చంద్రమోహన్‌లు వినూత్నంగా ఆలోచించారు. ఐదు ట్రాక్టర్లను తెప్పించి, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను వాగుల వద్ద దగ్గరుండి ఆయా గ్రామాలకు తరలించారు. వాగు దగ్గర చిక్కుకపోయిన ప్రజలను ట్రాక్టర్లతో సురక్షతంగా తమ గమ్యానికి చేర్చారు.
బుర్కపల్లివాగు, కత్తెరవాగు, కొత్తపల్లి వాగు వద్ద సుమారు 40 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. వైద్య సిబ్బందిని తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. మాకెందుకులే అనుకోకుండా, అపాయంలో కూడ ఉపాయాన్ని ఆలోచించి, వైద్య సిబ్బందిని విధులకు హజరయ్యే విధంగా చేసిన పోలీసులు నిజంగా మంచోళ్ళు అంటున్నారు స్థానికులు.
వరద ఏరులై పారుతున్న సమయంలో.. పోలీసులు అందుతున్న సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఊరు, ఏరు ఒక్కటయ్యాయి. ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. ఈ సమయంలో పోలీసులు తమ బాధ్యతను మరింత పెంచుకొని ఆశా వర్కర్లకు సాయమందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Tirumala Darshan: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వ దర్శనాలు పున: ప్రారంభం.. ఎప్పటినుంచంటే!