Telangana: ఎలా వస్తాయ్‌రా ఇలాంటి ఐడియాలు..! పోలీస్ డీపీలు పెట్టి ఏం చేశారంటే..
సాధారణంగా పోలీసులంటే అందరికీ భయమే. పోలీసుల నుండి ఫోన్ వచ్చిందంటే వణికిపోతుంటారు. ముఖ్యంగా దొంగతనం చేసిన వారికి, సహకరించిన వారికి పోలీసు స్టేషన్ నుండి వచ్చే ఫోన్లు అంటే మరింత భయం.. అలాంటి భయాన్ని ఈ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి ఈ కేటుగాళ్లు ఎలా బుక్కయ్యారు..? పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన చింతల చెర్వు ప్రశాంత్, అక్షిత్ కుమార్ నల్గొండ పట్టణం మన్యం చెల్కకు చెందిన షేక్ ఇర్ఫాన్, నల్గొండ పట్టణం హైమద్ నగర్ కు చెందిన షేక్ వాజిద్ లు సాధారణ పరిచయాలతో ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటు పడిన యువకులు ఈజీ మనీ కోసం అనేక స్కెచ్‌లు వేశారు. పోలీసుల పేరుతో బంగారం షాపు యజమానులను బెదిరిస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఇందు కోసం ఏడాదిగా గూగుల్ లో ఎస్సైల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకొని ఆ ఫోటోను ట్రూ కాలర్ డీపీగా పెట్టుకున్నారు. గూగుల్ మ్యాప్ లో బంగారం షాప్‌ల వివరాలు, యాజమానుల వివరాలు సేకరించి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి తాము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సైని మాట్లాడుతున్నానని బంగారం షాప్ యజమానులకు చెప్పేవారు. ఇటీవల జరిగిన దొంగతనం కేసులో తాము పట్టుకున్న దొంగలు మీ దుకాణంలోనే గోల్డ్ అమ్మినట్లు చెప్పారని, ఆ బంగారం మీ నుండి రికవరీ చేయాలని, లేకపోతే కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించేవారు.

Crime News
తాజాగా ఈనెల1 వ తేదీన చింతల చెర్వు ప్రశాంత్ తిరుమలగిరి గ్రామానికి చెందిన శివ కుమార్ అనే జువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి తాను రాజంపేట ఎస్సైని మాట్లాడుతున్నానని, నువ్వు దొంగల వద్ద బంగారం కొన్నావు, నీపైన కేసు కాకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఫోన్ పే చేయాలని బెదిరించారు. దీంతో భయపడిన శివకుమార్ 52 వేల రూపాయలు పంపారు. ఈనెల 8న హుజూర్ నగర్ పట్టణానికి చెందిన శ్రీనిధి జ్యువలరీ షాప్ యజమాని తుడిమల్ల నవీన్ కుమార్ కు ఫోన్ చేసి నేను కుప్పం ఎస్సై ని మాట్లాడుతున్నానని, దొంగల నుంచి బంగారం కొన్నావని బెదిరించారు.. ఆ బంగారం రికవరీ చెయ్యాలని లేకపోతే నీ పైన కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు. దీంతో అతను కూడా భయపడి వారు చెప్పిన నెంబర్ కు ఫోన్ పే ద్వారా 10 వేలు రూపాయలు పంపించారు.
ఈ కేటుగాళ్లు వాడిన డిపి, మాట్లాడిన తీరుపై గోల్డ్ షాప్ యజమాని నవీన్ కుమార్ కు అనుమానం వచ్చి హుజూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. డిపి ఆధారంగా లొకేషన్ తెలుసుకొని ముఠా గుట్టును రట్టు చేశారు. పోలీస్ డిపితో వ్యాపారులను బెదిరించిన కేటుగాళ్లు.. చివరకు ఆ డిపి తోనే పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. నలుగురు కేటుగాళ్ళను అరెస్టు చేయడంతో పాటు రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ ఫోన్లు, రూ.25వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చరమందరాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..