ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 15మంది నిందితులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీంతో ధరణి, భూ భారతి స్కామ్ డొంక కదుతుతోంది. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు.. కేసు విచారణ బాధ్యతలు ఏకంగా జనగామ ఏసీపీకి అప్పగించడం ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 15మంది నిందితులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. దీంతో ధరణి, భూ భారతి స్కామ్ డొంక కదుతుతోంది. ఒకవైపు అరెస్టుల పర్వం, మరోవైపు.. కేసు విచారణ బాధ్యతలు ఏకంగా జనగామ ఏసీపీకి అప్పగించడం ఆసక్తిగా మారుతోంది.
యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన అక్రమార్కుల గుట్టురట్టు అయింది. తెలంగాణలో కలకలం రేపిన ధరణి, భూ భారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణం కేసులో 15మంది నిందితులను అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు.. మరో 9మంది కోసం గాలిస్తున్నారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి తీగ లాగడంతో డొంక కదులుతోంది. ప్రధానంగా.. జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాదగిరిగుట్టలోని ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మోసాలు జరగ్గా.. ప్రభుత్వ ఆదాయానికి 3కోట్ల 90లక్షల రూపాయల వరకు గండి పడింది. ఈ కేసుకు సంబంధించి వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు.
ధరణి, భూ భారతి రిజిస్ట్రేషన్ల స్కామ్‌లోని నిందితులంతా యాదాద్రి, జనగామ జిల్లాలకే చెందినవారు కాగా.. వీరిలో ముగ్గురు వ్యక్తులను ప్రధాన నిందితులుగా తేల్చారు. పసునూరి బసవరాజు, జెల్లా పాండు, గణేష్‌కుమార్.. ఈ ముగ్గురు.. ఆన్‌లైన్ సర్వీస్‌లను ఆధారంగా చేసుకుని పేమెంట్స్ ఫోర్జరీలకు పాల్పడ్డారని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. మిగతా 12మంది కూడా మీ సేవా సెంటర్స్, కంప్యూటర్ సెంటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ధరణి, భూభారతి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారన్నారు సీపీ సన్‌ప్రీత్ సింగ్.
మీ సేవా సెంటర్స్ అడ్డాగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఫీజులను ప్రభుత్వ ఖజానాకు చెల్లించకుండా నిందితులు నిలువునా దోచేశారు. పేమెంట్స్‌కు వెబ్‌సైట్లలోని లోపాలను అనుకూలంగా మార్చుకున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులను.. చెల్లించాల్సిన దానికంటే తక్కువగా ఎడిట్ చేసి పేమెంట్స్ నిర్వహించారు. ఆయా నకిలీ చలాన్లను.. మధ్యవర్తులు, స్థానిక ఎమ్మార్వో ఆఫీసులు ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ముఖ్యంగా.. ప్రధాన నిందితులైన బసవరాజు, జెల్లా పాండు, గణేష్‌కుమార్.. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మీసేవ, ఆన్‌లైన్ సెంటర్స్ నిర్వాహకులను కమీషన్లతో అట్రాక్ట్ చేశారు. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను మధ్యవర్తుల ద్వారా సేకరించి.. వారే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చారు. ఇలా డాక్యుమెంట్స్ ఇచ్చినందుకు మీడియేటర్స్‌కి 10-30శాతం కమీషన్ చెల్లిస్తూ భారీ దోపిడీకి పాల్పడ్డారు.
ఇక.. ఈ స్కామ్‌కు సంబంధించి యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో మొత్తం 22 కేసులు నమోదు చేశారు వరంగల్ పోలీసులు. అరెస్ట్ అయిన 15 మంది నిందితుల నుంచి 63లక్షల రూపాయల నగదుతోపాటు.. సుమారు కోటి రూపాయల విలువగల ఇంటి ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, రెండు ల్యాప్‌టాప్స్, ఐదు కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. మొత్తంగా ధరణి, భూభారతి వెబ్‌సైట్‌లోని సాంకేతిక లోపాలతో ఆన్‌లైన్ కేటుగాళ్లు కోట్లలో లూటీ చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే సుమారు నాలుగు కోట్ల ఫ్రాడ్ జరగ్గా.. దర్యాప్తులో ఇంకెలాంటి కీలక విషయాలు బయటపడతాయో చూడాలి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
