AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చం ‘దృశ్యం’ సినిమాను తలపించిన కానిస్టేబుల్ మర్డర్ స్కెచ్..! చివరికి ఇలా జరిగిందేంటి?

ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి హత్య మూడు జిల్లాల్లో కలకలం రేపింది. కంచె చేనును మేస్తే కాపుకాసే వారెవరన్నట్లు ఓ కిరాతక కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేసి హతమార్చి అచ్చం దృశ్యం సినిమాను చూపించాడు. కానీ పోలీసుల విచారణలో ఆ కంత్రీగాడి మర్డర్ స్కెచ్ కథ అంతా బయటపడి అడ్డంగా బుక్ అయ్యాడు. అతనితో సుపారి తీసుకుని అభం శుభం ఎరుగని యువకుడిని హతమార్చిన ముఠా అరెస్ట్ అయ్యారు.

అచ్చం ‘దృశ్యం’ సినిమాను తలపించిన కానిస్టేబుల్ మర్డర్ స్కెచ్..! చివరికి ఇలా జరిగిందేంటి?
Social Activist Murder Case
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 22, 2025 | 8:25 PM

Share

ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడి హత్య మూడు జిల్లాల్లో కలకలం రేపింది. కంచె చేనును మేస్తే కాపుకాసే వారెవరన్నట్లు ఓ కిరాతక కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేసి హతమార్చి అచ్చం దృశ్యం సినిమాను చూపించాడు. కానీ పోలీసుల విచారణలో ఆ కంత్రీగాడి మర్డర్ స్కెచ్ కథ అంతా బయటపడి అడ్డంగా బుక్ అయ్యాడు. అతనితో సుపారి తీసుకుని అభం శుభం ఎరుగని యువకుడిని హతమార్చిన ముఠా అరెస్ట్ అయ్యారు. చివరికి వివాహేతర సంబంధమే ఇంతటి విషాదానికి కారణమైంది. మృతుడి సొంత పిన్ని మర్డర్ ప్లాన్‌లో పాత్రధారి కావడంతో గ్రామస్తులు ఆమెను చితకబాది పోలీసులకు అప్పగించారు. హంతక ముఠాను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సాయిప్రకాష్ అనే యువకుడు చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ యువకుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుపరిచితుడు. ఏప్రిల్ 15వ తేదీన తన కారులో వెంకటాపురం నుండి హనుమకొండకు వచ్చిన సాయిప్రకాష్ అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. అతను ఏమైపోయాడో తెలియదు. అతని కారు ఏమైపోయిందో అడ్రస్ లేకుండా పోయింది. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లులో చూపిస్తుంది. ఈ క్రమంలో సాయిప్రకాష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో నివ్వెరపోయే నిజాలు గుర్తించారు. సాయిప్రకాష్ హత్యకు గురైనట్లు గుర్తించారు. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన శ్రీనివాస్ అనే ఓ కానిస్టేబుల్ సాయిప్రకాష్ చిన్నమ్మ నీలిమతో వివాహేతర సంబంధ పెట్టుకున్నాడు. ఆ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాయి ప్రకాష్ అతన్ని సస్పెండ్ చేయించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ పక్కా ప్లాన్‌తో మర్డర్ స్కెచ్ వేశాడు. ఏప్రిల్15వ తేదీన హనుమకొండకు వచ్చిన సాయిప్రకాష్‌ను మట్టుపెట్టాలని ప్లాన్ చేశాడు శ్రీనివాస్.

అప్పటికే ఒక నలుగురు వ్యక్తులకు సుపారీ ఇచ్చిన శ్రీనివాస్ వారితో సాయిప్రకాష్ కారును ఆటోలో ఫాలో అయ్యారు. హన్మకొండలోని గోపాలపూర్ సమీపంలో ఆటోతో కారును ఢీ కొట్టి, ఆ గ్యాంగ్ అంతా అతని కారులో ఎక్కారు. కారులోనే విచక్షణారహితంగా కొట్టి, అతన్ని శాలువాతో గొంతు నులిమి చంపేశారు.

అదే కారులో హుస్నాబాద్ మార్గంలో వెళ్లి హుస్నాబాద్ సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో డెడ్ బాడీని పడేశారు. ఏప్రిల్ 17వ తేదీన స్థానికులు బావిలో డెడ్ బాడీని గుర్తించారు. హుస్నాబాద్ పోలీసులు అతను ఎవరా అని ఆరా తీశారు. కానీ ఆ డెడ్ బాడీ ఎవరిదో గుర్తుపట్టలేకుండా ఉండటంతో హుస్నాబాద్ మున్సిపల్ సిబ్బంది అక్కడే ఖననం చేశారు. అయితే హనుమకొండ పోలీసుల విచారణలో నివ్వెరబోయే నిజాలు బయటపడ్డాయి. చివరికి కానిస్టేబుల్ శ్రీనివాస్ అదుపులోని తీసుకున్న పోలీసులు ఈ మర్డర్ స్కెచ్ వెనుక అసలు కథను రాబట్టారు. తన వివాహేతర సంబంధాన్ని బయటపెట్టి సస్పెండ్ చేయించాడనే కక్షతో అతన్ని హత్య చేయించినట్లు విచారణలో తేలింది.

అయితే పోలీసుల అటెన్షన్ డ్రైవర్ట్ చేయడం కోసం అచ్చం దృశ్యం సినిమా తరహాలో స్కెచ్ వేశారు. మృతుడి సెల్‌ఫోన్ ఓ రైలులో పారేశారు. ఆ రైలు పాలకొల్లు వెళ్లేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోలీసుల విచారణలో చివరిసారి లొకేషన్ పాలకొల్లు చూపించడంతో అంతా పాలకొల్లు వైపు దృష్టి పెట్టారు. కానీ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకోవడంతో అసలు కథ బయటపడింది. అతనితోపాటు డెవిలీ సాయి, అరుణ్ కుమార్, అఖిల్, రాజు అనే నలుగురితో సహా కానిస్టేబుల్ ప్రియురాలు నిర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక ఎయిర్ ఫిస్టల్, ఒక కారు, రెండు ఆటోలు స్వాదీనం చేసుకున్నారు.

అయితే ఈ యువకుడి హత్యకు అతని చిన్నమ్మ నిర్మల కారణమని తెలియడంతో అరెస్ట్‌కు ముందు ఊరంతా భగ్గుమన్నారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రజలు, ఆమె భర్త ఆమెను జుట్టు పట్టుకుని చితకబదారు. చెప్పులతో కొట్టుకుంటూ రోడ్డుపై తీసుకెళ్లి వెంకటాపురం పోలీసులకు అప్పచెప్పారు.

అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సాయిప్రకాష్ హత్య నేపథ్యంలో వెంకటాపురంలో విషాద వాతావరణం అలముకుంది. వ్యాపార సంస్థలతోపాటు ఊరంతా స్వచ్ఛందంగా బంద్ పాటించి సాయి ప్రకాష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు..ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..