PM Modi: పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని మోదీ.. నిజామాబాద్ షెడ్యూల్ ఫిక్స్.. పర్యటనలో స్వల్ప మార్పు..
PM Modi Telangana Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు ఈనెల 1వ తేదీన రానున్నారు. పాలమూరు పర్యటనలో భాగంగా రూ.13,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రోడ్డు, రైలు, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, ఉన్నత విద్య వంటి పలు సెక్టార్లకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాలు ఉండనున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా నాగపూర్-విజయవాడ ఎకనామిక్ కారిడార్ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29: తెలంగాణ పర్యటనలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన పాలమూరు ప్రజా గర్జన సభలో, 3వ తేదీన నిజామాబాద్‌లో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8,021కోట్ల రూపాయల విలువైన ప్రాజక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకుంటుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.1369కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్‌కు మోదీ భూమిపూజ చేస్తారు. ఎయిమ్స్ నూతన భవనానికి శుంకుస్తాపన చేస్తారు.
తెలంగాణలో కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేసేందుకు టీ బీజేపీ నేతలు శ్రమిస్తున్నారు. ప్రధాని పాల్గొనబోయే బహిరంగసభ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రధాని సభకు లక్షలాదిగా తరలిరావాలని అర్వింద్ పిలుపునిచ్చారు.
తెలంగాణకు రహదారులు, ఎరువులు, కరెంట్ సమస్యలు తీరుస్తున్న ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు స్థాయి మరచి మాట్లాడుతున్నారని ఈటల మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు ఈటల. ప్రధాని తెలంగాణ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మోదీ పాలమూరు పర్యటనలో స్వల్ప మార్పు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి మోడీ రానున్నారు. 1:35కి శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:05 గంటలకు పాలమూరుకు ప్రధాని చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు సమరభేరి పేరిట బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు.
నిజామాబాద్ షెడ్యూల్ ఫిక్స్
ప్రధాని మోడీ నిజామాబాద్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 3న మోడీ రానున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ప్రధాని వస్తారు. బీదర్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్ కు మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 4:45 వరకు సభలో హాజరవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్ లోబయలుదేరి బీదర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాని ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవ్వనున్నారు.
ఇదిలా ఉండగా వచ్చే నెల 3వ తేదీన నిజామాబాద్ కు ప్రధాని మోడీ రాబోతున్నారు. ఈ పర్యటనలో రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.6 వేల కోట్లతో 800 మెగా వాట్ల ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే ఇందూరులో హెల్త్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులు, రూ.1300 కోట్లతో 493 బస్తీ దవాఖానలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనునున్నారు. అలాగే రూ.305 కోట్లతో 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన లైన్లను మోడీ ప్రారంభించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం