Telangana: పిట్ట కథలతో పొట్ట పోసుకుంటున్న పిట్టల దొర
కాలంతో పాటు అంతరించిపోతున్న గ్రామీణ కళారూపాల్లో పిట్టల దొర వేషం ఒకటి. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నాగరాజు తాతముత్తాతల నుంచి వచ్చిన ఈ వారసత్వ కళను కొనసాగిస్తూ, ఊరూరా తిరిగి పిట్ట కథలతో ప్రజలను అలరిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

దొరలకే దొర.. పిట్టల దొర! ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెబుతూ.. ఊరూరా తిరుగుతూ పిట్ట కథలతో ప్రజలను అలరించే కళాకారుడు. వినే వారు దొరికితే చాలు.. గంటల తరబడి ఊరి చరిత్రలు, పాత జ్ఞాపకాలు, సామాజిక అంశాలను తనదైన శైలిలో కథలుగా అల్లేస్తాడు. అతడే పిట్టల దొర. కాలగర్భంలో కలిసిపోతున్న ఎన్నో గ్రామీణ కళారూపాల్లో పిట్టల దొర వేషధారణ కూడా ఒకటి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ పొందిన ఈ కళ ఇప్పుడు అరుదుగా కనిపిస్తోంది. అయినప్పటికీ, తాతముత్తాతల నుంచి వచ్చిన ఆ వారసత్వ కళను నమ్ముకుని ఇప్పటికీ ప్రజలను నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఉన్నాడు. అతడే వెరైటీ పిట్టల దొర నాగరాజు.
ఎవరు ఈ పిట్టల దొర..?
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నాగరాజు అంటే అక్కడి ప్రజలకు సుపరిచితుడు. అయితే అతడిని నాగరాజు అని కంటే.. పిట్టల దొర నాగరాజు అని పిలిస్తేనే వెంటనే గుర్తుపడతారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కళను వృత్తిగా స్వీకరించిన నాగరాజు.. ప్రత్యేకమైన వేషధారణతో ఊరూరా తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఊరి చరిత్రలను కథలుగా చెబుతూ, పిట్ట కథలతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కథ చెప్పడం, సందర్భానుసారంగా మాటలు కలపడం, సమాజంలోని పరిస్థితులను తనదైన హాస్యంతో చూపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య.
తండ్రి నుంచి నేర్చుకున్న కళ
చిన్నప్పటి నుంచే తండ్రి వృత్తిని చూస్తూ పెరిగిన నాగరాజు.. ఆ కళనే తన జీవనాధారంగా మార్చుకున్నాడు. తండ్రి నుంచి నేర్చుకున్న పిట్టల దొర కళను దైవంగా భావించి, అదే మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. పూర్వకాల పద్ధతులు, సంప్రదాయాలు, గ్రామీణ జీవనం.. నేటి సమాజంలో జరుగుతున్న మార్పులను కలిపి పిట్ట కథల రూపంలో చెబుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. తన మాటల్లో హాస్యం ఉంటుంది.. సందేశం ఉంటుంది.. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ప్రయత్నం కూడా ఉంటుంది. అందుకే చూసిన వారు, విన్నవారు శభాష్ పిట్టల దొర అంటూ నాగరాజును అభినందిస్తుంటారు.
పిట్టల దొరే జీవనాధారం
నాగరాజుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా నేర్చుకున్న ఈ కళనే వృత్తిగా స్వీకరించి, పిట్టల దొర అవతారంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని నాగరాజు ఆనందంగా చెబుతున్నాడు. కాలం మారుతున్న కొద్దీ అనేక గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయి. కొత్తతరం ఆధునిక వినోదాల వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ.. పాతకాలపు సంప్రదాయాలు, కట్టుబాట్లు, గ్రామీణ సంస్కృతిని ప్రజలకు గుర్తు చేస్తూ నాగరాజు తన కళను కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకమైన వేషధారణతో ఊరూరా తిరుగుతూ.. ఉన్నది లేనిది ఉన్నట్టుగా చెబుతూ.. పిట్ట కథలతో నలుగురిని నవ్విస్తూ.. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ పిట్టల దొర.
ఏది ఏమైనా.. ఈ ఆధునిక కాలంలో కూడా పాతకాలపు గ్రామీణ కళను సజీవంగా ఉంచుతూ, పిట్టల దొర వేషంలో ఊరూరా తిరిగి ప్రజలను అలరించడం నిజంగా విశేషమే.
వీడియో దిగువన చూడండి..
