AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కెప్టెన్‌ కళ్లు మూసుకోవద్దు.. మాకు మీరు కావాలి’ కెప్టెన్ స్మిత్ ప్రాణాల కోసం పోరాడిన డెంటిస్ట్

ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలను కాపాడేందుకు ఓ డెంటిస్ట్ 45 నిమిషాల పాటు పోరాడిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తలకు, మెడకు, చేతులకు తీవ్ర గాయాలై రక్తస్రావంతో విమానం కాక్‌పిట్‌లో పడిపోయిన స్మిత్‌ను బతికించేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన డెంటిస్ట్ డాక్టర్ షుటా ముసాయెవ్ తీవ్రంగా ప్రయత్నించారు. గాయపడిన పైలట్‌కు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చికిత్స అందించారు.

'కెప్టెన్‌ కళ్లు మూసుకోవద్దు.. మాకు మీరు కావాలి' కెప్టెన్ స్మిత్ ప్రాణాల కోసం పోరాడిన డెంటిస్ట్
Dentist Keeps Flydubai Pilot Awake As He Battled To Save Him
Sharada V
|

Updated on: Oct 07, 2026 | 10:56 AM

Share

సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్ జాతీయుడైన కోపైలట్ గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో స్మిత్ తల, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. విమానం కాక్‌పిట్‌లో అరుపులు వినిపించడంతో డెంటిస్ట్‌ డాక్టర్ ముసాయెవ్ అక్కడికి పరుగెత్తారు. ముందుగా దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహాయం చేసిన ఆయన.. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన స్మిత్‌పై దృష్టి పెట్టారు. కాక్‌పిట్ నేలపై రక్తస్రావంతో పడిపోయిన స్మిత్‌ను చూసి వెంటనే ప్రాథమిక చికిత్స ప్రారంభించారు.

టీ-షర్టులతో రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం

విమానం కదులుతున్న సమయంలో సరైన వైద్య పరికరాలు అందుబాటులో లేవు. దీంతో డాక్టర్ ముసాయెవ్ టీ-షర్టులను ఉపయోగించి స్మిత్ గాయాలపై ఒత్తిడి పెట్టారు. రక్తస్రావాన్ని తగ్గించేందుకు ఐస్ ప్యాకెట్లు ఉపయోగించారు. ‘తలకు, ఎడమ చేతికి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. టీ-షర్టుతో గాయాలపై ఒత్తిడి పెట్టాను. కానీ ప్రతిసారి రక్తస్రావాన్ని పరిశీలించేందుకు దాన్ని తొలగిస్తే మరింత రక్తం వచ్చేది. అందుకే ఐస్‌తో పాటు ఒత్తిడి కొనసాగించాను” అన్నారు. దాదాపు 45 నిమిషాలు స్మిత్ గాయాలపై ఒత్తిడి పెడుతూ ఆయన పరిస్థితిని గమనించారు.

‘కళ్లు మూసుకోవద్దు.. మాకు మీరు కావాలి’

స్మిత్ స్పృహ కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యమని డాక్టర్ ముసాయెవ్ భావించారు. అందుకే ఆయనతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. “దయచేసి నిద్రపోవద్దు.. మాకు మీరు కావాలి’ అంటూ స్మిత్‌కు ధైర్యం చెప్పారు. అతడి కుటుంబం గురించి అడిగారు. పిల్లలు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? వంటి విషయాలు అడిగారు. ‘భయపడకండి.. మీరు మీ కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్తారు. మనం త్వరలోనే ల్యాండ్ అవుతున్నాం’ అంటూ ధైర్యం చెప్పారు.

స్మిత్ తన పేరు, వయసు చెప్పడంతో పాటు తాను దుబాయ్‌లో నివసిస్తున్నానని, భారత్‌కు చెందినవాడినని చెప్పారు. అయితే పల్స్ పడిపోయి పెదాలు నీలంగా మారి స్మిత్ పరిస్థితి ఒక దశలో మరింత విషమించింది. దాంతో స్మిత్ ‘దయచేసి నన్ను కాపాడండి.. నేను ఇక్కడ చనిపోవాలని అనుకోవడం లేదు’ అని వేడుకున్నట్లు డాక్టర్ తెలిపారు.  వెంటనే అతడి కాళ్లను పైకి ఎత్తి పట్టుకున్నాను దాంతో  కొద్దిసేపటికి పల్స్ సాధారణ స్థితికి వచ్చింది అని డెంటిస్ట్ మీడియాకు వివరించారు. స్మిత్ పెదాలు నీలం రంగులోకి మారడం గమనించి, ‘త్వరగా ల్యాండ్ చేయాలి. అతడికి ఎక్కువ సమయం లేదు’ అని పైలట్లను హెచ్చరించినట్లు చెప్పారు.

పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి నిరాకరణ

విమానంలో స్మిత్ నొప్పితో బాధపడుతూ పెయిన్ కిల్లర్ అడిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే డాక్టర్ ముసాయెవ్ మందు ఇవ్వడం ప్రమాదం అని గ్రహించి ఇవ్వలేదు. స్మిత్ వెన్నుపై పడుకుని ఉన్నందున అతడిని కదిలిస్తే మళ్లీ తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని భావించారు. బదులుగా స్మిత్‌కు కొద్దికొద్దిగా నీరు ఇచ్చారు. అతడి పల్స్, పెదాల రంగును గమనిస్తూ మాట్లాడుతున్నాడా లేదా చూసారు. చివరకు విమానం సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అక్కడి వైద్య సిబ్బందికి స్మిత్‌ను అప్పగించే వరకు డాక్టర్ ముసాయెవ్ అతడి పక్కనే ఉన్నారు. ‘గుడ్ లక్ నా మిత్రమా.. అంతా మంచే జరుగుతుంది’ అంటూ వీడ్కోలు పలికారట.

స్మిత్ మా ప్రాణాలు కాపాడాడు.. మేం ఆయన ప్రాణాలు కాపాడాం

ఈ ఘటన తర్వాత డాక్టర్ ముసాయెవ్ అతని భార్య తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. విమానంలో భయానక ఘటన ప్రభావం వారిపై చాలా రోజులు ఉంది. అయితే స్మిత్ తమ ప్రాణాలను కాపాడిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.’ కర్మ సిద్ధాంతంలో చెప్పినట్లుగా  అతను మా ప్రాణాలను కాపాడాడు.. మేం అతని ప్రాణాలను కాపాడాం’ అని ముసాయెవ్ మీడియాతో అన్నారు.

నిలకడగా స్మిత్ ఆరోగ్యం

కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు పుర్రెలో పగుళ్లు ఏర్పడినట్లు షాకింగ్ విషయాన్ని గమనించిన  టబుక్‌ లోని వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యూఏఈకి ఎయిర్‌ లిఫ్ట్‌ చేసారు. ప్రస్తుతం దుబాయ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్‌ స్మిత్‌ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని భారత రాయబార కార్యాలయం తాజాగా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్మిత్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ ‘హీరో’గా కొనియాడారు. విమానంలో తీవ్రంగా గాయపడినప్పటికీ చివరి క్షణం వరకు విమానాన్ని, అందులోని ప్రయాణికులను కాపాడేందుకు స్మిత్ చేసిన ప్రయత్నాలు, ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ ముసాయెవ్ చేసిన 45 నిమిషాల పోరాటం ఈ ఘటనలో కీలకంగా నిలిచింది.

Follow Us