పూల కోసం వెళ్లి తండ్రి, కొడుకు మృతి

×

పూల కోసం వెళ్లి తండ్రి, కొడుకు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహగున్ మైవుడ్స్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉదయం పూజ కోసం పూలు కోస్తుండగా, 23వ అంతస్తు బాల్కనీ నుండి జారిపడి తండ్రి, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులు రణదీప్‌ పాత్ర (40), అతని 11 ఏళ్ల కొడుకు ఆరోవ్. ఉదయం పూజ నిమిత్తం బాల్కనీలో పూలు కోస్తుండగా, ఆరోవ్ కాలు జారి గాలిలో వేలాడాడు. వెంటనే రణదీప్ తన కొడుకును పట్టుకోవడానికి ప్రయత్నించగా, పట్టుతప్పి ఇద్దరూ 23వ అంతస్తు నుండి కిందపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దుర్ఘటన కేవలం ప్రమాదం కాదని, నిర్లక్ష్యం కూడా దీనికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. హైరైజ్ అపార్ట్‌మెంట్లలో నివసించే వారు బాల్కనీలకు తప్పనిసరిగా సేఫ్టీ గ్రిల్స్ లేదా నెట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్న పొరపాటు ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ విషాదంతో రణదీప్ భార్య, ఆరోవ్ తల్లి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Phani CH