Video: సముద్రమే మండుతోందా..? మంటల్లో ట్యాంకర్ నుంచి ఒలికిన చమురు..!
రష్యాలోని నల్ల సముద్రం తీరం సోచీ ప్రాంతంలో చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. నౌకలో మంటలు చెలరేగాయి. లీకైన ముడి చమురు కొంత మేర సముద్రంలోనే మంటల్లో కాలుతోంది. ఆ సమయంలో నౌకలో 23 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ట్యాంకర్‌కు సమీపంలోని సోచి ప్రాంతంలో భారీ నల్లటి పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అఫ్రామాక్స్ రియో నౌకలో ఉన్న 23 మంది భారతీయ నావికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదనీ రష్యా అధికారులు తెలిపారు. ట్యాంకర్‌కు సమీపంలోని సోచి ప్రాంతంలో భారీ నల్లటి పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీచ్‌లు మూసివేత
నౌకను ‘షాడో ఫ్లీట్ ‘ ఆంక్షల జాబితాలో చేర్చిన ఉక్రెయిన్ నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిపింది. రష్యా ఆంక్షల నుంచి తప్పించుకుని చమురు రవాణా చేయడానికి ఉపయోగించే నౌకలను ‘షాడో ఫ్లీట్ ‘గా పిలుస్తారు. ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో సోచి బీచ్‌లను మూసివేశారు. నీరు, గాలి నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు. గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయి కంటే తక్కువే ఉన్నట్లు సిరియస్ ఫెడరల్ అధికారి డిమిత్రి ప్లిష్కిన్ తెలిపారు. ప్రస్తుత దాడికి ఉక్రెయిన్ కారణమన్న ఆరోపణలను అధ్యక్షుడు జెలెన్‌స్కీ తోసిపుచ్చారు.
A large fire is burning on the water off Sochi tonight, with footage showing a long line of flame and a massive black smoke column visible across the city — consistent with burning oil from a tanker.
Ukrainian-aligned accounts claim the tanker was hit.
Russian sources say only that a vessel near the port is on fire with the cause unknown.
— Clash Report (@clashreport) October 6, 2026
కాగా, నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల దాడులు పెరిగాయి. రొమేనియా తీరానికి సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన సరుకులను తీసుకెళ్తున్న ధాన్యం నౌకలపై రష్యా ఇటీవల దాడులు చేసింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఆ వాణిజ్య నౌకలోని ఒక సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ఆ నౌకలో రేప్‌సీడ్ ఆయిల్ ఉండగా నౌక పైభాగం దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. టోగో జెండాతో ‘అల్ఫా వతన్’, పలావు జెండాతో ‘ఏబుల్’ అనే మరో రెండు వాణిజ్య నౌకలు కూడా డ్రోన్ దాడులకు గురయ్యాయి. బల్గేరియా తీరానికి సుమారు 112 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటనలు జరిగాయి.
భారతీయ నావికులపై వరుస దాడులు
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎంవీ రోయాద్ మమ్మదోవ్ అనే నౌకపై నల్ల సముద్రంలో జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో ఇద్దరు విదేశీ నావికులు మృతి చెందగా.. ముగ్గురు భారతీయులతో పాటు పలువురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన భారతీయులకు రొమేనియాలో చికిత్స అందించగా వారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఒమన్ సమీపంలో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీదుగా ప్రయాణిస్తున్న పనామా జెండాతో ఉన్న MT On Peace నౌకపై జరిగిన దాడినీ భారత్ ఖండించింది. ఈ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారించాలని ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్ కు సూచించారు.
నౌకల భద్రతపై భారత్-లైబీరియా ఒప్పందం
ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకలు, వాటిలో పనిచేసే నావికుల భద్రత కోసం భారత్, లైబీరియా కలిసి చర్యలు చేపట్టాయి. సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో 25 దేశాలు కలిసి ‘గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ‘ను ప్రారంభించాయి. వాణిజ్య నౌకలు, నావికులపై లక్ష్యంగా జరుగుతున్న దాడులను అడ్డుకోవడం, సముద్ర మార్గాల్లో భద్రతను పెంచడం ఈ గ్రూప్ ప్రధాన లక్ష్యం.ప్రస్తుతం అఫ్రామాక్స్ రియోలో ఉన్న మొత్తం 23 మంది భారతీయులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి