AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన దిగ్గజ ఫార్మా కంపెనీలు..!

తెలంగాణ ప్రభత్వంతో కుదిరిన ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది.

Telangana: గ్రీన్‌ ఫార్మాసిటీలో భారీ పెట్టుబడులు.. ముందుకొచ్చిన దిగ్గజ ఫార్మా కంపెనీలు..!
Green Pharma Mou
Prabhakar M
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 22, 2024 | 6:49 PM

Share

హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరంగా ఎదుగుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టాయి. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూలైన్‌లో వేచి ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్ ఫార్మాసిటీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. డాక్టర్‌ రెడ్డీస్, అరబిందో, హెటిరో, ఎంఎస్‌ఎన్‌, లారస్ కంపెనీలు గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఈ క్రమంలోనే దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ మహానగరంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం(నవంబర్‌ 22) రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో సమావేశమయ్యారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఆరు కంపెనీలు కలిసి దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.

ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ పార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ కాగా.. పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అనుకూల వాతావరణం సృష్టిస్తుందని మంత్రి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..