Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాగా, హైదరాబాద్ నగరంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వానతో దారులు గోదారిలా మారాయి. రహదారులు, చెరువులు ఏకమై పారాయి. నిన్న మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మొదలైన వాన శుక్రవారం తెల్లవారుజామున వరకు పడుతూనే ఉంది. దీంతో నగరంలోని దారులన్నీ చెరువులుగా మారిపోయాయి. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలిస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. కాప్రాలో గరిష్టంగా 7.5 సెం.మీ.వర్షపాతం నమోదు కాగా.. మల్కాజ్‌గిరిలో 6.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది.
మరో వైపు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ శివారు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు జంట జలాశయాల రెండు గేట్లు ఎత్తి వరదను మూసీలోకి వదిలారు. మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 442 క్యూసెక్కులుగా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి