Kaushik Reddy: ఎట్టకేలకు జాతీయ మహిళా కమిషన్‌కు కౌశిక్‌రెడ్డి క్షమాపణ.. లేఖ ద్వారా గవర్నర్‌కు..
Governor Tamilisai: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.. ఎట్టకేలకు దిగొచ్చారు. జాతీయ మహిళా కమిషన్ కు క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ప్రకటించింది మహిళా కమిషన్.
గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ జాతీయ మహిళా కమిషన్‌ను క్షమాపణలు కోరారు. మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ గవర్నర్ తమిళిసైకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తానని మహిళా కమిషన్‌కు కౌశిక్ రెడ్డి వివరించారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు నిన్న కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన ఆయన.. గవర్నర్‌కు కూడా లేఖ ద్వారా క్షమాపణలు చెబుతానంటూ వివరణ ఇచ్చారు.
గవర్నర్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 12న నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన కౌశిక్ రెడ్డి.. జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి వెంట ఆయన తరపు లాయర్ కూడా ఉన్నారు. ఇంకోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడనని, క్షమించాలని మహిళా కమిషన్‌ను కోరారు.
గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని మొన్నటివరకు బీజేపీ, ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కానీ తన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. జాతీయ మహిళా కమిషన్ నుంచి నోటీసుల రావడం, ఢిల్లీలో విచారణకు హాజరైన నేపథ్యంలో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..