Humanity: వెర్రితలలు వేస్తున్న ‘విలనిజం’.. పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా..!
మాయమైపోతున్నాడమ్మ..మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ కవి ఈ స్వార్థపూరిత సమాజాన్ని ఎండగడుతూ తన హృదయ వేదనను తెలియజేశాడు. నిజమే.. మనిషి మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. క్షణికావేశంలో, అనుమానపు పొరల్లో, పేగుబంధాన్ని సైతం చూడలేని కర్కశత్వంతో ప్రవర్తిస్తున్నాడు మనిషి. సమాజంలో ఈ పోకడలు కారణాలేంటో చెప్పుకుందాం..

చిన్నప్పుడు ఎత్తుకుని చాక్లెటిచ్చిన తాతకు.. కసితీరా కత్తిపోట్లు, ఇంటికి రాగానే ఆప్యాయంగా అన్నం పెట్టే ఇల్లాలికి రోకటిపోటు.. ముద్దుముద్దుగా అమ్మా, నాన్నా అని పిలిచే కన్నపేగుకు ఒంటిపై అక్రమ సంబంధాల వాతలు..! ఏరా సిట్టింగ్‌కు రెడీయా అని పిలిచే దోస్త్‌కు ఆ కొద్దిసేపటికే భూమిపై నూకలు చెల్లు..! అంతా మనుషులే.. రోజూ మన మధ్య తిరిగే వాళ్లే.. పైకే నవ్వులు.. కడుపు నిండా కత్తులు.. ఎప్పుడు ఎవడు ఏ కారణంతో ఎవరిని అంతం చేస్తారో తెలియని మాయా ప్రపంచం..! అమ్మాయి కోసం ఒకడు.. ఆస్తి కోసం మరొకడు.. అక్రమసంబంధం మోజులో ఇంకొకడు.. మానవసంబంధాలను మారణహోమంలో ముంచేస్తున్నారు. వెర్రితలలు వేస్తున్న విలనిజం పాతికేళ్ల కుర్రాడి నుంచి యాభై ఏళ్ల బామ్మదాకా అందరిలో విలనిజం వెర్రితలలు వేస్తోంది. అంతేకాదు… ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలకు కారణం ఏంటని.. దాని మూలాలను వెతుకుతూ వెళ్తే కనిపిస్తున్న అడ్రస్ ‘ఇల్లు’. నానమ్మ కళ్లలో ఆనందం కోసం చెల్లెలి భర్తనే చంపేశారు. వయసుమళ్లిన తరువాత శాంతంగా, ప్రశాంతంగా ఉండాల్సిన నాయనమ్మే.. మనవళ్లకు పగను నూరిపోయడం వల్ల జరిగింది కాదా ఆ ఘోరం..! వంద మంది అమ్మాయిలను అనుభవించడమే లక్ష్యమట. ఆ టార్గెట్ మరిచిపోకుండా ఉండేందుకు ఏకంగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు ఛాతి మీద. అంతటి ఉన్మాదం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఢిల్లీలో నిర్భయపై జరిగిన ఘోరం గానీ, హైదరాబాద్‌లో దిశపై జరిగిన అఘాయిత్యం గానీ.. ఆ నేరం చేసిన వాళ్ల మానసిక స్థితి,...




