కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
తెలంగాణలోనూ కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే..

ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు స్కూలుకు రావద్దని పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విద్యార్థులైనా, టీచర్లకు అయినా జలుబు, జ్వరం, శ్వాస సంబంధింత సమస్యలుంటే, మూడు రోజులు బడికి రావద్దని, లక్షణాలు తగ్గేంత వరకూ చికిత్స తీసుకోవాలని విద్యా శాఖ కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో..ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో వైరస్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, స్కూలు జరుగుతున్న సమయంలో కనీసం నాలుగు సార్లు చేతులను కడుక్కునేందుకు అవసరమైన లిక్విడ్స్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.




