ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా
జీవితం ఎంతో విలువైనది. కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పుడు ఆత్మహత్య అనే ఆలోచన రావడం సహజం కావచ్చు కానీ, అది ఎప్పటికీ పరిష్కారం కాదు. చట్టపరంగా, ధర్మపరంగా ఇది నేరం. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రాణత్యాగం చేసుకునే ఈ ధోరణి కేవలం మనుషుల్లోనే కాదు, ఇతర జీవరాశుల్లో కూడా కనిపిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

జంతువులు, పక్షులు, చివరకు సముద్ర జీవులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడతాయని తెలుసా? ఆత్మహత్య అనేది మనిషికి మాత్రమే తెలిసిన విషాదం అని మనం అనుకుంటాం. కానీ, మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక కుక్క తన యజమాని దూరమైన బాధలో బిల్డింగ్ పైనుంచి దూకడం.. లేదా ఒక తిమింగలం కావాలనే ఒడ్డుకు వచ్చి ప్రాణాలు వదలడం! అవును, మనం చూసే ప్రకృతిలో మనుషుల కంటే ఎక్కువగా భావోద్వేగాలకు లోనయ్యే ప్రాణులు ఎన్నో ఉన్నాయి. అవి తమ బాధను చెప్పుకోలేవు, కానీ భరించలేని స్థితిలో ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధపడతాయి. జంతు ప్రపంచంలో కనిపించే ఈ వింతైన, విచారకరమైన ప్రవర్తన గురించి తెలిస్తే మీరు విస్మయానికి గురవుతారు.
మనిషికి అత్యంత సన్నిహితమైన జంతువు కుక్క. యజమాని పట్ల ఇవి చూపే విశ్వాసం వెలకట్టలేనిది. అయితే, తీవ్రమైన ఒత్తిడికి లేదా విపరీతమైన నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. తమను తాము గాయపరుచుకోవడం, ఎత్తైన ప్రదేశాల నుంచి దూకడం లేదా ఏమీ తినకుండా ఒకే చోట నిశ్చలంగా పడుకుని ఉండటం వంటివి వీటిలో కనిపించే ముందస్తు లక్షణాలు.
ఒత్తిడితో ప్రాణాలు వదిలే జంతువులు..
పందులు కూడా ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విపరీతమైన ఆందోళన కలిగినప్పుడు అవి బలమైన గోడలను లేదా రాళ్లను తమ తలతో బలంగా ఢీకొట్టుకుని ప్రాణాలు విడుస్తాయట. ఇక పిల్లులు, ఎలుకలు కూడా ఒంటరితనం లేదా తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. నీటిలో నివసించే తిమింగలాలు, డాల్ఫిన్లు మరియు చేపలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవి తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఉద్దేశపూర్వకంగా సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చి ప్రాణాలు వదులుతాయి. కొన్ని సందర్భాల్లో డాల్ఫిన్లు బలవంతంగా తమ ఊపిరిని బిగబట్టుకుని చనిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గాలి పీల్చుకోవడం ఆపేయడం ద్వారా అవి తమ ప్రాణాలను తీసుకుంటాయి.
జీవి ఏదైనా.. ప్రాణం అనేది ఒక అద్భుతం. మనుషులకైనా, జంతువులకైనా ఒత్తిడి, నిరాశ అనేవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. జంతువుల ప్రవర్తనలో మార్పులను గమనించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాగే, మనుషులు కూడా ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడాలే తప్ప ఆత్మహత్య అనే అడ్డదారిని ఎంచుకోకూడదు. ఎందుకంటే, పోరాడి గెలవడమే అసలైన జీవన పరమార్థం.
