AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? అయితే మీరు చేస్తున్న తప్పేంటో తెలుసుకోండి!

ఇండియాలో EMIపై ఐఫోన్ కొనుగోళ్లు పెరిగినప్పటికీ, నిపుణులు ఆర్థిక ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. నెలకు రూ.1 లక్ష ఆదాయం ఉన్నవారికి మాత్రమే రూ.1.34 లక్షల ఫోన్ EMI సురక్షితం. మొత్తం EMIలు నెలవారీ ఆదాయంలో 30 శాతం మించకుండా చూసుకోవడం, ఆరు నెలల ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఉండటం ముఖ్యం.

EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? అయితే మీరు చేస్తున్న తప్పేంటో తెలుసుకోండి!
Iphone 15
SN Pasha
|

Updated on: Mar 08, 2026 | 6:30 AM

Share

ఇండియాలో ఒకప్పుడు ప్రీమియం గాడ్జెట్‌గా భావించిన యాపిల్‌ ఐఫోన్‌ ఇప్పుడు సాధారణంగా అందరి దగ్గర కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందిస్తున్న సులభమైన EMIలతో ఈ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడం మరింత ఈజీ అయింది. నెలకు కొద్దిగా చెల్లిస్తే సరిపోతుందనే భావనతో చాలామంది రూ.1 లక్షకు పైగా ధర ఉన్న ఫోన్లను కూడా EMIపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలను గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సహజ్‌ మనీ వ్యవస్థాపకుడు అభిషేక్‌ కుమర్‌ ప్రకారం.. భవిష్యత్ ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని విలువ వేగంగా తగ్గే గాడ్జెట్లను కొనుగోలు చేయడం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా ఇప్పటికే కార్లు, విద్యా రుణాలు లేదా క్రెడిట్ కార్డు బకాయిలపై EMIలు చెల్లిస్తున్నవారు మరో EMIను జోడిస్తే వారి ఆర్థిక భారం నిశ్శబ్దంగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. అయితే ఫోన్‌ను వృత్తి అవసరాల కోసం లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగిస్తే అలాంటి ఖర్చును కొంతవరకు సమర్థించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ అలాంటి కొనుగోళ్లు పొదుపు లేదా పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీయకూడదని ఆయన హెచ్చరించారు.

నిపుణుల సూచనల ప్రకారం.. ఒక వ్యక్తి తన మొత్తం EMIలు కలిపి నెలవారీ ఆదాయంలో 30 శాతం లోపే ఉండేలా చూసుకోవాలి. 40 శాతం దాటితే ఆర్థికంగా ప్రమాదకరంగా మారవచ్చు. 50 శాతం మించితే రుణ ఉచ్చులో పడే ప్రమాదం కూడా ఉంది. అదనంగా కనీసం ఆరు నెలల ఖర్చులు, EMIలను కవర్ చేసే అత్యవసర నిధి కూడా ఉండాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. ఉదాహరణకు సుమారు రూ.1.34 లక్షల ధర ఉన్న ఐఫోన్‌ను 12 నెలల EMIలో కొనుగోలు చేస్తే నెలకు సుమారు రూ.11,200 చెల్లించాల్సి ఉంటుంది. నెలకు కనీసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ EMI సౌకర్యంగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది కొనుగోలుదారులు చేసే ప్రధాన తప్పు ఏమిటంటే, వారు మొత్తం ధర లేదా ఆర్థిక ప్రభావం గురించి కాకుండా నెలవారీ EMI మొత్తంపైనే దృష్టి పెడతారు. అయితే EMI సౌలభ్యం ఉన్నప్పటికీ, అది వ్యక్తిగత ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఖరీదైన గాడ్జెట్ కొనుగోలు చేసే ముందు అవసరం, ఆదాయం, పొదుపులు, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని వారు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us