KTR: సుప్రీంకోర్టులోనూ కేటీఆర్‌కి నో రిలీఫ్.. ఫార్ములా ఈ కేసులో పూర్తిస్థయి విచారణకు లైన్ క్లియర్..!
రేసు కేసులో మళ్లీ గేరు మారింది. తెలంగాణ రాజకీయాల్ని ఊపేస్తున్న ఫార్ములా ఈ కేసు మళ్లీ ఎడ్వాంటేజ్ కాంగ్రెస్ అంటోంది. కేటీఆర్ ఆర్గ్యుమెంట్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో గులాబీ దండు డిఫెన్స్‌లో పడ్డట్టయింది. కుంభకోణం లేదు లంబకోణం లేదు అని విర్రవీగినవాళ్లంతా ఇప్పుడేమంటారు అని నిలదీస్తోంది హస్తం పార్టీ. ఈ రగడ ఇక్కడితోనే ఆగే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే.. రేసు కేసులో రేపు, ఎల్లుండి రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంకా రక్తి కట్టించే ఛాన్సుందట.
మాజీ మంత్రి కేటీఆర్‌కు కోర్టు కష్టాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినా కేటీఆర్‌కు ఊరట దొరకలేదు. అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని, విచారణ జరిగేతీరాలని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాల్ని పరిశీలించాలంటూ ఈనెల 8న సుప్రీంకోర్టు మెట్లెక్కారు కేటీఆర్. తమ వాదనలు కూడా వినాలంటూ తెలంగాణ ప్రభుత్వం అప్పట్లోనే కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసులో కేటీఆర్ A-1గా ఉండడంతో సుప్రీంకోర్టు విచారణపై సహజంగానే ఆసక్తి పెరిగింది.
జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట.. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని.. ఈ సమయంలో కేసు కొట్టివేత తగదని కోర్టుకు చెప్పారు. కానీ.. ప్రొసీజర్ ఉల్లంఘన జరిగి ఉండొచ్చు తప్ప.. కేటీఆర్ ఎక్కడా ఆర్థిక లబ్ది పొందలేదని, పాలసీ డెసిషన్‌ని మాత్రమే అమలు చేశారని వాదించారు డిఫెన్స్ లాయర్. రాజకీయ ప్రోద్బలంతో ప్రత్యర్థులు పెట్టిన కేసు కనుక.. కొట్టివేసి తమ క్లయింట్‌కు రిలాక్సేషన్ ఇవ్వాలని వేడుకున్నారు కేటీఆర్ తరఫు అడ్వొకేట్. కానీ.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని, లోతైన విచారణ జరగాల్సిందేనని తేల్చేసింది సుప్రీంకోర్టు. అవసరమైతే మళ్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలన్న కేటీఆర్ వినతిని కూడా తిరస్కరించింది.
తనపై నమోదైన FIRని కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను విధిలేని పరిస్థితుల్లో కేటీఆర్ వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో.. కేసును డిస్మిస్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆవిధంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎపిసోడ్ అడ్డం తిరిగింది.
ఇదిలా ఉంటే.. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ ఈడీ విచారణకు కాబోతున్నారు. ఇప్పటికే ఏ2, ఏ3లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా విచారించింది ఈడీ. వాళ్లిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్‌ని ప్రశ్నించబోతోంది ఈడీ. ఏసీబీ విచారణ సమయంలో తనతో పాటు అడ్వొకేట్‌ను అనుమతించాలని కోర్టుకెక్కారు కేటీఆర్. కానీ.. ఈడీ విచారణకు మాత్రం అడ్వొకేట్ సాయం లేకుండా ఒంటరిగానే వెళ్లబోతున్నారు. ఈడీ అధికారులు కేటీఆర్‌పై సాయంత్రం దాకా ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. ఫార్ములా-ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందని, ఆర్బీఐ మార్గదర్శకాల్ని బేఖాతరు చేసి నిధుల మళ్లింపు చేశారన్నది ఈడీ మోపిన అభియోగం.
ఇదిలా ఉంటే.. గురువారం ఈడీ విచారణ ముగిసిపోగానే.. ఏసీబీ మళ్లీ సీన్లోకి రాబోతోంది. మాజీమంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 9వ తేదీ తొలిసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఎనభైదాకా ప్రశ్నలడిగారని, అరిగిపోయిన రికార్డుల్లా అడిగిందే అడుగుతున్నారని ఎద్దేవా చేసిన కేటీఆర్‌ను.. మళ్లీ ఇంటరాగేట్ చేసేందుకు రెడీ ఔతోంది ఏసీబీ. ఇలా.. ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా కేటీఆర్‌ని దర్యాప్తు సంస్థలు రౌండప్ చేయడంతో.. ఫార్ములా-ఈ రేస్ కేసు ఏ మలుపు తీసుకుంటుంది అన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..