Jandhyala: జంధ్యాల.. హాస్యం ఉన్నంత కాలం ఆ పేరు అజరామరం
తెలుగు తెరపై నవ్వుల పంటకు ఆయన రారాజు.. శ్రీవారికి ప్రేమలేఖలు రాయించిన చిలిపి చంటబ్బాయి. తన చమత్కారాలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన హై హై నాయకుడు.. హాస్యం ఉన్నంత కాలం ఆయన పేరు అజరామరం. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. హాస్య బ్రహ్మ జంధ్యాల. జంధ్యాల జయంతి (14 జనవరి) సందర్భంగా చిరు నవ్వుల నివాళి..
నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నారు జంధ్యాల. ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారినా అలాగే గుర్తుండిపోయింది. తెలుగు తెరపై జంధ్యాల అనేది పేరు కాదు.. బ్రాండ్. ఎన్ని తరాలైనా మారని ఓ బ్రాండ్. ఆయన పేరు వినిపిస్తే చాలు పెదాలపై తెలియకుండానే నవ్వులు వచ్చేస్తాయి.
జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల. ప్రతీ సినిమాలోనూ తనదైన శైలిలో ఓ చిన్న థీమ్ తీసుకుని కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆయన పూర్తి పేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారీయన. చిన్నప్పటి నుంచి జంధ్యాలకు నాటకాలంటే మక్కువ కాస్త ఎక్కువే. చాలా చిన్న వయసులోనే ఆయన సినిమా రంగం వైపు వచ్చేసారు. 1976లో.. పాతికేళ్ళ వయసులో ‘దేవుడు చేసిన బొమ్మలు’తో రచయితగా పరిచయం అయ్యారు జంధ్యాల. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే అగ్ర రచయితగా మారారు.
సిరిసిరిమువ్వ, అడవిరాముడు, శంకరాభరణం, సాగరసంగమం, వేటగాడు, సప్తపది లాంటి ఎన్నో సినిమాలలో అద్భుతమైన మాటలు రాశారు జంధ్యాల. దాదాపు 50 చిత్రాలకు రచయితగా పని చేయగా.. 40 చిత్రాలు ఘన విజయం సాధించాయి. జంధ్యాల అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది హాస్యమే. కానీ ఆయనలో హాస్యం మాత్రమే కాదు.. హృద్యం కూడా ఉంది. ఎన్నో సినిమాలకు కడుపు చెక్కలయ్యే కామెడీ పంచులతో పాటు.. మనసు మురిసి కళ్లు తడిసేలా మంచి మాటలు కూడా రాసారు. రైటర్‌గా రెండు వైపులా ఆయన కలానికి పదునెక్కువే. ఇది జంధ్యాలకు మాత్రమే సొంతమైన ఘనత.
ఓవైపు వేటగాడు, అడవిరాముడు లాంటి మాస్ సినిమాలకు డైలాగులు రాస్తూనే.. మరోవైపు విశ్వనాథ్ తెరకెక్కించిన సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం లాంటి క్లాసిక్స్‌కు మాటలు రాసిన ఘనత జంధ్యాల సొంతం. ఇంత వేరియేషన్ చూపించిన రచయిత బహుశా తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ లేరేమో..?
రావుగోపాలరావుతో జంధ్యాల పలికించిన మాటల ప్రాసలు తూటాలై పేలి రచయతగా ఆయన సత్తా చూపించాయి. గుక్క తిప్పుకోకుండా ఆయనతో చెప్పించిన ప్రాస డైలాగులు ఈ రోజుకు పాపులరే. మరీ ముఖ్యంగా వేటగాడు సినిమాలో జంధ్యాల కలం పరుగులు తీస్తుంది.
మాటల రచయతగా ప్రారంభమైన జంధ్యాల కెరీర్.. ఆ తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత ఉరకలెత్తింది. కుటుంబం అంతా కూర్చుని తరాల పాటు చూడగలిగే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారు జంధ్యాల. ఎన్ని తరాలు మారినా.. జంధ్యాల హాస్యానికి ఎక్స్‌పైరీ లేదు. దర్శకుడిగా చేసిన తొలి చిత్రం ముద్ద మందారంతోనే విజయం అందుకున్నారీయన.
కేవలం సినిమాలు చేయడంతోనే తన పని అయిపోయింది అనుకోలేదు జంధ్యాల. ఆయన కారణంగానే హాస్యం కొన్ని తరాలు బతికింది. ఈ రోజు మనం చూస్తున్న ఎంతోమంది కమెడియన్స్‌ను జంధ్యాలే పరియం చేసారు. నాటి సుత్తివేలు, వీరభద్రరావు జంట నుంచి నేటి కోట, బ్రహ్మానందం వరకు అంతా జంధ్యాల కలం నుంచి జాలువారిన వారే.
ఇలాంటి హాస్యం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పండి..? అప్పుడెప్పుడో 40 ఏళ్ళ కింద వచ్చిన ఈ కామెడీ ఇప్పటికీ అంతే నిత్యనూతనంగా ఉంది. కేవలం సుత్తి కామెడీ మాత్రమే కాదు.. బ్రహ్మానందం ఈ రోజు తెలుగు తెరపై ఈ స్థాయిలో నవ్వుల రారాజుగా వెలిగాడంటే దానికి కారణం.. దాని వెనక జంధ్యాల కలం ప్రభావం ఎంతో ఉంది.
అహ నా పెళ్లంటలో అరగుండు వెధవ అయినా.. జయమ్ము నిశ్చయమ్మురాలో హౌజ్ ఓనర్ గోపాలంగా అయినా.. హైహై నాయకాలో పటేల్ మాస్టర్ అయినా.. కారెక్టర్ ఏదైనా జంధ్యాలతో బ్రహ్మి జోడీ కుదిరిందంటే కడుపులు చెక్కలవ్వాల్సిందే. అలాగే కోట శ్రీనివాసరావును కూడా ఎన్ని రకాల అద్బుతమైన పాత్రల్లో చూపించారు జంధ్యాల.
జంధ్యాల అంటే కామెడీ ఒక్కటే కాదు.. తన మార్క్ డైలాగ్స్ కూడా. దరిద్ర నారాయణుడికి దిక్కుమాలిన స్వరూపం అని వర్ణించినా.. పాండురంగారావును జేమ్స్ పాండ్ చేసినా.. హై హై నాయకాలో బూతు బూతు అంటూ వినీ వినిపించని బూతులు తిట్టించినా.. శ్రీలక్ష్మీతో బాబూ చిట్టి అని పిలిపించినా.. చూపులు కలిసిన శుభవేళలో కోటతో అచ్చ తెలుగులో మాట్లాడించినా.. అది ఒక్క జంధ్యాలకే సొంతం.
జంధ్యాల సినిమాల్లో కొన్ని విచిత్రమైన తిట్లు ఉంటాయి. అలాంటి మాటలు రాయడం ఆయనకు మాత్రమే సాధ్యం. ష్ గప్‌చుప్ అనే సినిమాలో 3 నిమిషాల పాటు నాన్ స్టాప్ తిట్ల దండకం పెట్టారు జంధ్యాల. ఆ పాట నేటికీ పాపులరే.
జంధ్యాల సినిమా అంటే కేవలం కామెడీ అని అంతా ఫిక్సైపోతుంటారు కానీ ఈయనలో మరో కోణం కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు భాషపై ఆయనకు ఉన్న పట్టు ఇంతా అంతా కాదు. అలాగే కళలను కూడా తన సినిమాలలో ఎక్కువగా ప్రోత్సహించేవారు జంధ్యాల. ఇవన్నీ ఒకెత్తు అయితే రాజేంద్రప్రసాద్‌తో జంధ్యాల కాంబినేషన్ మరో ఎత్తు.
కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన జంధ్యాల నుంచే ఆనందభైరవి లాంటి క్లాసిక్ వచ్చింది. క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్‌తో అహ నా పెళ్లంట, రెండు రెళ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, ప్రేమ జిందాబాద్ లాంటి సినిమాలు తెరకెక్కించారు జంధ్యాల.
జంధ్యాల ఒక్కో చిత్రం ఒక హాస్యపు ఆణిముత్యం. అప్పట్లో చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతోనూ చంటబ్బాయి, బాబాయ్ అబ్బాయి, సీతారామ కళ్యాణం లాంటి సినిమాలు చేసారు జంధ్యాల. ముఖ్యంగా ఊర మాస్ సినిమాలు చేస్తున్న చిరంజీవిని చంటబ్బాయిలో జంధ్యాల చూపించిన తీరు అద్భుతం. ఆయనలో ఉన్న కామెడీ కోణాన్ని అంత అందంగా చూపించిన ఘనత హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది. చంటబ్బాయిలో శ్రీలక్ష్మీ, పొట్టి ప్రసాద్ ట్రాక్ అద్భుతం అంతే. నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా, నోటికి మాట నెత్తికి రీటా కాళ్లకు బాట నేను తింటా సపోటా లాంటి డైలాగులు ఇప్పటికీ హాస్య ప్రియులను అలరిస్తునే ఉన్నాయి.
టైటిల్స్ విషయంలోనూ జంధ్యాల ట్రెండ్ సెట్ చేసారు. అహనా పెళ్లంట, ఒహోనా పెళ్లంట, చూపులు కలిసిన శుభవేళ, జయమ్ము నిశ్మయమ్మురా, వివాహా భోజనంబు, నీకు నాకు పెళ్లంట, ప్రేమ ఎంత మధురం, బావబావ పన్నీరు లాంటి పాత తెలుగు సినిమాల్లోని పాటల పల్లవులు టైటిల్స్‌గా పెట్టే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు జంధ్యాల. కెరీర్ చివర్లో ఆపద్భాందవుడులో చిరంజీవితో కలిసి నటించారు జంధ్యాల.
నటీనటులెవరైనా.. జంధ్యాల సినిమాలో ఉన్నారంటే ఆయన మార్క్ ఉండాల్సిందే. సింహభాగం కామెడీ సినిమాలే చేసినా.. అందులో వేటికవే ప్రత్యేకం. ఇంటిల్లిపాది చూసే ఆరోగ్యకరమైన హాస్యం రాసిన ఘనత జంధ్యాల సొంతం. తెలుగు వాళ్లను నవ్వులతో ముంచిన హాస్యబ్రహ్మ.. 2001 జూన్ 19న శోకసంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా ఆయన లేకపోయినా.. ఆయన అందించిన హాస్యం బతికే ఉంటుంది.