రాజధాని అమరావతికి 300 బస్సులు ఏర్పాటు చేసిన టీటీడీ! ఎందుకంటే..?
వెంకటపాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి 27,000 మంది భక్తులు హాజరు కానున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విస్తృత ఏర్పాట్లను వెల్లడించారు. 300 బస్సులను ఏర్పాటు చేశారు. పూల అలంకరణ, భక్తి సంగీత కార్యక్రమాలు, ప్రసాదాల పంపిణీతో కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

వెంకటపాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని 27,000 మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. శుక్రవారం ఆలయం ముందు ఉన్న క్యాంపు కార్యాలయంలో టీటీడీ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ పరిధిలోని వెంకట పాలెంలో మార్చి 15 శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టిటిడి ఈవో వెల్లడించారు. సీఆర్డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు వేంకట పాలెం చేరేందుకు వీలుగా టిటిడి దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి మండలాల ప్రజలు సులువుగా కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు వీలుగా బస్సులను ఏర్పాటు చేశారు.
అదేవిధంగా విజయవాడ నుండి అమరావతికి బస్సు సౌకర్యం విరివిగా ఉన్న నేపథ్యంలో మందడం నుండి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేశారు. తద్వారా మందడం నుండి కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యం కల్పించింది. అదేవిధంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు 4 టన్నుల ఫ్లవర్స్, 30,000 క్లట్ ఫ్లవర్స్, ఆలయంలో మామిడి, అరటి, టెంకాయ తోరణాలతో అలంకరించనున్నారు. శ్రీవారి కల్యాణానికి పూలమాలలు టిటిడి గార్డెన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గం.ల నుండి 5 గం.ల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
సాయంత్రం 5 గం.ల నుండి 6.15 గం.ల వరకు చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తనలను కల్పించనున్నారు. తదనంతరం కల్యాణోత్సవంలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కీర్తనలను ఆలపించనున్నారు. శ్రీనివాస కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఒక బ్యాగ్ లో పంపిణీ చేయనున్నారు. శ్రీనివాస కల్యాణ వేదిక ప్రాంగణం ప్రాంతంలో 5 వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్స్, 18 ఎల్ఈడీ స్క్రీన్ లు, దశావతారాలు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీ అమ్మవార్ల కటౌట్లు, ఆలయం పరిసరాలలో 60 తోరణాలతో పాటు శ్రీవేంకటేశ్వర ఆలయంలో విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.