AP Nominated Posts: ఒక కుర్చీ.. 46 కర్చీఫులు.. నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ మామూలుగా లేదుగా..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కాంపిటీషన్ మాత్రం 1:46 ఉంది. అంటే 1 పోస్టుకు 46మంది పోటీ పడుతున్నారు. చంద్రబాబు, షరతులు, వార్నింగుల మధ్య పదవులు దక్కించుకునే అదృష్టవంతులెవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు వేయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తమకు పదవులు ఇవ్వాలంటూ.. ఆశావహులు దరఖాస్తులు సైతం చేసుకున్నారు. 1 నామినేటెడ్ పోస్టుకు 46మంది పోటీ పడుతున్నారు. ఇదీ.. ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు పోటీ పడుతున్న తీరు. ఇప్పటికే 62 కార్పొరేషన్ పోస్టులు భర్తీ అయ్యాయి. వీటిని కూటమి నేతలు 49, 10, 3 చొప్పున పంచుకున్నారు. అంటే కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన టీడీపీకి 49 పోస్టులు, జనసేనకు 10 పదవులు, బీజేపీకి 3 పోస్టులు దక్కాయి. ఇక 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డ్స్‌లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అంటే 1314 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ఏకంగా 60 వేల అప్లికేషన్లు వచ్చాయట. అంటే నామినేటెడ్ రష్ నెక్ట్స్ లెవెల్ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
పార్టీ కోసం పనిచేయడమే అర్హత.. సీనియర్లు, మంత్రుల సిఫార్సు
నామినేటెడ్ పోస్టులకు కావాల్సిన అర్హతలు.. పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డవాళ్లు.. ఇక వాళ్లను గుర్తించేదెలా? ఈ బాధ్యతను పార్టీలోని సీనియర్లు, మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి జూన్‌ని టార్గెట్‌గా పెట్టారు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో ఆలస్యం అవుతోందని ఆశావహులు వాపోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే ఆ పదవులకు తగిన పేర్లను అందించడంలో కొంతమంది నేతలు జాప్యం చేస్తుండడంతో.. వెయిటింగ్ లిస్టుతో వెయిటింగ్ టైమ్ కూడా పెరిగిపోతోందంటున్నాయి పార్టీ వర్గాలు.
షరతులు వర్తిస్తాయి
ఇక టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన తాజా టెలి కాన్ఫరెన్స్‌లో.. పార్టీ కోసం కష్టపడ్డవారి పేర్లను సిఫార్సు చేయాలని సీనియర్ నేతలకు సూచించారు చంద్రబాబు.. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్‌లను నియమిస్తామన్నారు బాబు. ఇప్పుడు పదవులు రాని వారికి రెండేళ్ల తర్వాత ఇస్తామని భరోసా ఇచ్చారు. పదవులు రావడానికి షరతులు వర్తిస్తాయంటూ చంద్రబాబు చెప్పారు.
నేతలు హుందాగా వ్యవహరించాలని సూచన
నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నామన్న బాబు.. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు హుందాగా వ్యవహరించాలని నేతలకు సూచించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాని చంద్రబాబు హామీనిచ్చారు.
1314 పోస్టులు.. 60వేలమంది పోటీ.. లాటరీలో లక్కీ పోస్టు దక్కించుకునే అదృష్టవంతులెవరో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..