Telangana: బెట్టింగ్ యాప్‌ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై మరో లెక్క
బెట్టింగ్ యాప్‌ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

బెట్టింగ్ యాప్‌లపై మరింత సీరియస్‌గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్‌రెడ్డి. ఆ మేరకు అవసరమైతే చట్టలను కూడా సవరిస్తామన్నారు. సీఎం ఆదేశాలతో బెట్టింగ్ కేసుల్లో శిక్షలు పెంచేందుకు అవసరమైన చట్టసవరణకు సిద్ధమమయ్యారు అధికారులు. అలాగే బెట్టింగ్ యాప్‌ల కేసును CIDకి బదిలీ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. అందుకోసం ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. IG లేదా ADG స్థాయి అధికారికి సిట్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. యాప్‌ల వెనక ఎవరున్నా చర్యలు తప్పవంటున్న సర్కార్..అందుకోసం సిట్‌కు ప్రత్యేక అధికారాలు కూడా కల్పించనుంది.
బెట్టింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ విష్ణుప్రియ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది..హైకోర్టు. కేసు దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. పోలీసుల విచారణకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్‌లో పోలీసులు కేసులు నమోదు చేశారన్న ప్రభుత్వం తరపు న్యాయవాది.. 2 కేసులను సిట్‌కు బదిలీ చేయనున్నట్టు తెలిపారు. దీంతో చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు స్పష్టం చేసింది..న్యాయస్థానం. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం చేసిన పలువురు నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసులో ఇప్పటికే ఐదుగురిని విచారించారు. బెట్టింగ్ కేసులను సిట్‌కు బదిలీ చేయడం ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు తిరుగుతున్నట్లు సమాచారం. ఈ కేసులపై సమగ్ర విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మరిన్న తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..