Nalgonda: మోసాన్ని కూడా కాపీ కొట్టిన ముఠా… చివరికి ఏమైందంటే..?
ఎక్కువగా విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడుతుండడం చూశాం. కాపీ అనేది ఇప్పుడు విద్యార్థులకే పరిమితం కాలేదు.. అన్ని రంగాలకు విస్తరించింది. దొంగతనాలు, మోసాలు చేయడంలో కూడా కొందరు కాపీ కొడుతున్నారు. ఈజీ మనకోసం పక్కవాడు చేసిన అదే తరహా మోసంతో కోట్లు కొల్లగొట్టాలని ఓ ముఠా స్కెచ్ వేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయింది. ఆ ముఠా ఎలాంటి కాపీ కొట్టి మోసానికి పాల్పడిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల పలుగు తండాకు చెందిన రమావత్ మధునాయక్ పదవ తరగతి తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఇదే తండాకు చెందిన బాలాజీ నాయక్ అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. బాలాజీ నాయక్ వద్ద మధు నాయక్ కొంతకాలం ఏజెంట్‌గా పని చేశాడు. ఖరీదైన కార్లు, విలువైన ఆస్తులతో లగ్జరీ లైఫ్ గడుపుతున్న బాలాజీ నాయక్‌ను చూశాడు. బాలాజీ నాయక్ మాదిరిగానే తాను కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని మధు నాయక్ భావించాడు. ఇందుకోసం బాలాజీ నాయక్ మాదిరిగానే అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలతో ఉడయించాలని మధు నాయక్ పెద్ద ప్లాన్ వేశాడు.
బంధువులతో ముఠాగా…
తన బావలు భరత్, బాబు, రమేశ్‌లతో మధు నాయక్ ముఠాగా ఏర్పడ్డాడు. గిరిజన ప్రాంతాల ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు కేటుగాళ్లు.. వందల వడ్డీ చూపించి కోట్లను కొల్లగోడుతున్నారు. హైదరాబాదులో గోకులనందన (GN) ఇన్ఫ్రా ఐడియా ప్రైవేట్ కంపెనీ పెట్టి రియల్ ఎస్టేట్ ఆఫీసు ఏజెంట్లను నియమించారు. జహీరాబాద్ దగ్గర వెంచర్లు, హైదరాబాద్‌లో పబ్బులు, స్పా సెంటర్లు, కర్నూల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని తప్పుడు డాకుమెంట్స్‌తో అమాయక గిరిజనులను బురిడీ కొట్టించారు. నెలకు 15-18 రూపాయలు అధిక వడ్డీ ఆశ చూపి మాయ మాటలతో గిరిజన ప్రాంతాల నుండి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. జనానికి కుచ్చుటోపి పెట్టిన కోట్లాది రూపాయలతో లగ్జరీ కార్లు, బంధువులు, స్నేహితుల పేరిట ఖరీదైన భవనాలు, భూములు కొనుగోలు చేశారు.
అమాయకుల నుంచి కొల్లగొట్టిన కోట్ల రూపాయల డబ్బులతో పబ్ అండ్ బార్, స్పా సెంటర్ లలో 2.5 కోట్లు, IPL బెట్టింగ్, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసి ముఠా నష్టపోయింది. ఇదే సమయంలో జనానికి శఠగోపం పెట్టిన బాలాజీ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కొద్ది నెలలుగా బాధితులకు అసలు వడ్డీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న మధు నాయక్‌పై బాధితులు ఒత్తిడి పెంచారు. దీంతో మధు నాయక్ పారిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మధు నాయక్ ముఠా గుట్టు రట్టు చేశారు. 9 మంది ముఠా సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి విలువైన భూమి పత్రాలు, నాలుగు కార్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన బాధితులకు సూచించారు. బాధితులు తమను ఆశ్రయిస్తే విచారణ చేసి నిందితుల ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.




