AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Sagar: అలలపై అలా.. సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ రీ స్టార్ట్

కృష్ణానది ఒడిలో లాహిరి లాహిరి అంటూ దట్టమైన నల్లమల అటవీ అందాల మధ్య లాంచీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ.. గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య సాగే నార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ ఈనెల 22నుంచి ప్రారంభించేందుకు టీజీటిడీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Nagarjuna Sagar: అలలపై అలా.. సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ రీ స్టార్ట్
Telangana Tourism Lanchi Tour
M Revan Reddy
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 8:18 AM

Share

దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టూ శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేసే అనుభూతినిస్తుంది. నవంబర్ 22 నుంచి తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం తిరిగి ప్రారంభం కానుంది. పర్యాటకులు, ప్రయాణికులు, భక్తుల కోసం టూర్ ప్యాకేజీలను పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి రానుపోను పెద్దలకు రూ.3250, పిల్లలకు రూ.2,600 టికెట్ ధరలను నిర్ణయించింది. అలాగే నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు మాత్రమే వచ్చే పెద్దలకు రూ.2,000లు, పిల్లలకు రూ.1,600 వసూలు చేయనున్నారు. లాంచీలో ప్రయాణికులు నాగార్జున సాగర్‌ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణం ఉంటుంది. నదిలో సుమారు 110 కిలోమీటర్ల దూరం.. ఏకధాటిగా ఆరు గంటల లాంచీ జర్నీ ఉంటుంది. లాంచీ ప్రయాణంలో మధ్యాహ్నం భోజనం సౌకర్యము లాంచీలోనే ఏర్పాటు ఉంటుందని పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు.

శనివారం ఉదయం 10:30 గంటలకు నాగార్జున సాగర్ నుండి లాంచీ బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు పాతాళగంగకు చేరుకుంది. మరుసటి రోజు పర్యాటకులు, భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత లాంచీ నాగార్జునసాగర్‌కు తిరిగి బయలుదేరి వెళ్తుంది. అయితే శ్రీశైలంలో రూమ్, ట్రాన్స్ పోర్ట్ వంటి వాటికి ఎవరికి వారే భరించాల్సి ఉంటుందని పర్యాటక శాఖ తెలిపింది. ఈనెల 22 నుంచి ప్రతి శనివారము టికెట్ల బుకింగ్ ఆధారంగా సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. సోమవారం నుండి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ టికెట్ల కోసం www.tgtdc.in వెబ్ సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ :9848540371, 9848125720, అలాగే నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ :7997951023 ఫోను నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us