Hanumakonda: ఇంటికి నిప్పుపెట్టిన చిట్టెలుక..
ఎలుక చూడండి ఎంత పని చేసిందో..! ఏకంగా ఓ ఇంటికి నిప్పు పెట్టింది.. ఆ ఇల్లంతా కాలి బూడిదయ్యేలా చేసింది.. వింటుంటే విచిత్రంగా ఉన్నా అంతుచిక్కని విచిత్ర గాధ ఇది... ఎలుక వల్ల ఇల్లంతా కాలిపోయి నిరాశ్రయులైన ఆ కుటుంబం లబోదీబోమంటుంది.

ఎలుక ఇంటికి నిప్పు పెట్టిన విచిత్ర సంఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది.. చిల్పూర్ మండలం కిష్టాజిగూడెం గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ తన ఇంట్లో నిత్యం దేవుడికి దీపం పెడుతుంది.. ఆమె భక్తే ఊహించని విధంగా నిరాశ్రయురాలిని చేసింది. ఇంట్లో వెలిగించిన దీపం వాళ్ల గూడు చెదిరేలా చేసింది.
చంద్రమ్మ కుటుంబానిది పెంకుటిల్లు. ఎప్పటిలాగా ఇంట్లో దీపం వెలిగించిన చంద్రమ్మ దీపంతో పాటు పండ్లు, ప్రసాదం ఒక ప్లేట్‌లో పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టింది.. అయితే దీపంతో ఉన్న ఆ ప్లేట్‌ను ఎలుకలు ఇంటి పై కప్పులోకి లాక్కెళ్లాయి.. సూరులో కూడా ఆ దీపం అలాగే వెలుగుతుండడంతో.. నిప్పు అంటుకొని పెంకుటిల్లు పై భాగంలోని వెదురుకు మంటలు వ్యాపించాయి. ఆ మంటలు క్రమంగా వ్యాప్తి చెంది ఇల్లంతా దగ్ధం అయ్యింది..
ఆ మంటలు వ్యాపించిన వెంటనే చంద్రమ్మ లబోదిబోమని మొత్తుకోవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తం అయి.. చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. ఈ మంటలో ఇంట్లోనిగృహోపకరణాలతో పాటు 23 వేల రూపాయల నగదు ఇతర సామాగ్రి మొత్తం ఖాళీ బూడిదయ్యాయి.. నిరాశ్రయులైన చంద్రమ్మ కుటుంబం విలపిస్తుంది. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
