తెలంగాణలో మరో కీలక ఒప్పందం.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా 27వేల కోట్ల ఎంవోయూలు
తెలంగాణలో మరో కీలక ఒప్పందం జరిగింది. 27వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు టీజీ రెడ్కోతో రెండు కంపెనీలు ఎంవోయూ చేసుకున్నాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ఒప్పందం జరగడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఆ వివరాలు

తెలంగాణలో పెట్టుబడుల పెట్టేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై తెలంగాణలో పెట్టుబడులకు ఆయా కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క సమక్షంలో 29 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు TG REDCOతో ఎకోరేస్ ఎనర్జీ ఇండియా, జీపీఆర్ఎస్ ఆర్య కంపెనీ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వ న్యూ ఎనర్జీ పాలసీతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు టీమ్ దావోస్ వెళ్ళినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి 20వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నట్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
అలాగే.. మెగా కంపెనీ 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 7,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ రెండు కంపెనీలు డీపీఆర్ తయారు చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు 27 వేల కోట్ల పెట్టుబడులతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఎకోరేస్ ఎనర్జీ ఇండియా కంపెనీ, 15 జిల్లాల్లో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల అభివృద్ధికి జీపీఆర్ఎస్ ఆర్య కంపెనీ 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ చేసుకున్నట్లు వెల్లడించారు భట్టి విక్రమార్క.