AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడపిల్లలు కాదు.. ఆడ పులులు.. తెలంగాణలో మొదటి శివంగి టీమ్..!

నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతతో “టీం శివంగి” అనే పేరుతో ఒక మహిళా కమాండో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ధ్యేయంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

ఆడపిల్లలు కాదు.. ఆడ పులులు.. తెలంగాణలో మొదటి శివంగి టీమ్..!
Police Shivangi Team
Vijay Saatha
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 9:07 PM

Share

నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతతో “టీం శివంగి” అనే పేరుతో ఒక మహిళా కమాండో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ధ్యేయంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ టీమ్‌ను మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాలలో ముందుండాలన్న ఆశయంతో నిర్మల్ ఎస్పీ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అన్నారు. ఇటీవల మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురు మహిళలను శివంగి టీమ్ ఎంత కృషి చేసి కనుగొన్నదీ, వారి చొరవ, ధైర్యసాహసాలు అభినందనీయమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ విధంగా శివంగి టీమ్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ కష్టం అనుకోకుండా, ఆసక్తితో చేయాలని మంత్రి సీతక్క సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జిల్లాలో కూడా లేని విధంగా, మహిళలు పురుషులతో సమానంగా ముందుకు రావాలన్న సంకల్పంతో, ఎంపిక చేసిన మహిళలకు 45 రోజుల కఠోర శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ శిక్షణ ద్వారా మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దేశంలోని త్రివిధ దళాలలో ఉన్న స్పెషల్ కమాండో ఫోర్సులు, ఆర్మీ కమాండోలు, నేవీలో మార్కోస్, అలాగే ఎన్‌ఎస్జీ, ఎస్‌పీజీ వంటి అత్యుత్తమ బలగాలు, మన రాష్ట్రంలో గ్రేహౌండ్స్ బలగాలు పనిచేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు మహిళ కమాండోలు ఏ రాష్ట్రంలో లేరని ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచనలతో ‘టీం శివంగి’ని తయారు చేయడం జరిగిందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. ఈ టీమ్‌కు అధునాతన ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. వాటిని వినూత్న రీతిలో వాడేలా తీర్చిదిద్దారు. తెలంగాణ పోలీసులలో అత్యాధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి, జిల్లా స్థాయిలో పరిచయం చేశారు. ఈ టీమ్‌ను పురుష పోలీసు కానిస్టేబుల్ స్థాయికి ధీటుగా తీర్చిదిద్దినట్టు ఆమె తెలిపారు.

ఈ శిక్షణలో భాగంగా మహిళలకు శారీరక దృఢత్వం పెంపొందించడమే కాకుండా, రన్నింగ్ రేసులు, వెర్టికల్ రోప్ క్లైంబింగ్, మనుగడ పద్ధతులు, యుద్ధ తంత్రాలు, పేలుడు పదార్థాల వినియోగం, అన్ని రకాల ఆయుధాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలపై ఫైరింగ్, ఆయుధాల నిర్వహణ, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నావిగేషన్, ఆకస్మిక వ్యూహాలు రూపొందించడం, శత్రు కదలికలు అంచనా వేయడం, అడవిలో సంకేతాలను అర్థం చేసుకోవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడులు, ఎదురు దాడులపై శిక్షణ అందించారు.

అంతేకాకుండా, ఒక్కొక్కరిని ఒక్కో విభాగంలో నిపుణులుగా తీర్చిదిద్దారు. కొంతమందికి యుద్ధ తంత్రాలపై, మరికొంతమందికి ఫీల్డ్ సిగ్నల్స్, ఇంకొంతమందికి ఫైరింగ్, మరో వర్గానికి నిఘా వ్యవస్థలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరినీ ఒక సమర్థవంతమైన స్పెషల్ టీమ్‌గా రూపొందించి, జిల్లా పోలీసు వ్యవస్థలోకి సమర్ధంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా మహిళా భద్రత, సామర్థ్యాలు, సమానతకు కొత్త దిశగా అడుగులు పడుతున్నారు. “టీం శివంగి” రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలిచే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..