AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti: ధరణిపై త్వరలో శ్వేత పత్రం.. సమస్యల పరిష్కారానికి సదస్సులు

ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార,  పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు.

Ponguleti: ధరణిపై త్వరలో శ్వేత పత్రం.. సమస్యల పరిష్కారానికి సదస్సులు
Minister Ponguleti Srinivas
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 27, 2024 | 3:04 PM

Share

ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార,  పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి ఒక కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని తెలిపారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో “తెలంగాణ పునర్నిర్మాణం” పై నిర్వహించిన సెమినార్ కు మంత్రిగారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1వ తేది నుండి 7వ తేది వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రాన్ని విభజిస్తే, రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసి కూడా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సోనియాగాంధీ నెరవేర్చారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, అసెంబ్లీ లో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ప్రకటించారని చెప్పారు. ఏ ఉద్దేశ్యంతో, ఏ లక్ష్యంతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అవి నెరవేరలేదని అన్నారు. అరవై ఏళ్ళ ఆకాంక్షలకు భిన్నంగా వ్యహరించారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, తెలంగాణ అస్తిత్వాన్ని మంట కలిపారు.

నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల విషయంలో అశ్రద్ధ వహించారని, చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని, నిరుద్యోగ కుటుంబాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఒక క్యాబినెట్ మంత్రి అవహేళనగా మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ విధానాలతో స్వార్థంకోసం టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీలతో నిరుద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని అన్నారు.

ఏడాదిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను, భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏడాదిలోపే అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే 23వేల ఉద్యోగాలను భర్తీ చేసామని, మార్చి 2వ తేదిన వివిధ విభాగాలకు సంబంధించి ఆరువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో మెగా డీఎస్సీని కూడా ప్రకటించబోతున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు టీఎస్పీఎస్సి ను ప్రక్షాళన చేసామని అనుభవమైన నిజాయితీ గల అధికారులను అక్కడ నియమించడం జరిగింది.

నీళ్ళ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగేల నిర్ణయాలు తీస్కున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ పెద్దలు 80వేల పుస్తకాలు చదివానని, తానే ఇంజనీర్ ను, తానే తాపీ మేస్త్రిని, తానే ఒక డిజైనర్ ను అంటూ ప్రపంచ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మించానని ప్రచారం చేసుకున్న ఆ పెద్దమనిషి ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రపంచ అద్భుతం నేడు కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం ఒక నిదర్శనం అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ఊహించని రీతిలో విధ్వంసానికి గురి అయిందన్నారు. అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసారో చెప్పడానికి ఇటీవల విడుదల చేసిన కాగ్ రిపోర్టు నిదర్శనమన్నారు. పదేండ్లపాటు అధికారాన్ని వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు.