AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య ఎన్నిక.. మునుగోడు బైపోల్స్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున కేటీఆర్ మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి మునుగోడు ప్రజల జనబలం కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు.

KTR: ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య ఎన్నిక.. మునుగోడు బైపోల్స్‌పై మంత్రి కేటీఆర్ కామెంట్స్
Ktr Vs Rajagopal Reddy
Surya Kala
|

Updated on: Oct 10, 2022 | 5:56 PM

Share

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య  మాటల యుద్ధం జరుగుతుంది. పోటాపోటీగా మాటలను రువ్వుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మునుగోడు ఎన్నికల పై బీజేపీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక ఇది అన్నారు. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో ఇన్నాళ్లు తన నియోజక వర్గ ప్రజలను పట్టించుకోలేదు.. తన  నియోజకవర్గాన్ని ఇన్నాళ్లుగా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈ రోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున కేటీఆర్ మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి మునుగోడు ప్రజల జనబలం కి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదని.. ఈ  విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలను సూచించారు.

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు కేటీఆర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అంటూ సంచలన కామెంట్స్ చేశారు.  నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరారని కేటీఆర్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిందన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి, ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇంకో సంవత్సరం పాటు పదవి కాలం ఉన్నా, ఉప ఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బిజెపికి రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఒకవైపు బిజెపి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని ఆయన విఫలం అయిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే టీఆర్ఎస్  పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..