Harish Rao: ఈ ఏడాది నుంచే ఆ కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు.. మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిమ్స్ గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఎం సి హెచ్ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
టీవీవీపీ పరిధిలో కొనసాగుతున్న 23 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇప్పటికే 20 తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయి. వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 సెంటర్లను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేయాలి. మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనులు వేగంగా పూర్తి చేయాలి. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో 9 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులు త్వరగా పూర్తి చేసి యాక్సిడెంట్స్ బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండాలి. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దు. అవసరమైన మేరకు మందులు ఆయా ఆసుపత్రుకు పంపిణీ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య పరికరాలు నిత్యం పని చేసే విధంగా ఉండేందుకు ఇ ఉపకరణ్ పోర్టల్ ను పూర్తిగా వినియోగించాలి.
– హరీశ్ రావు, తెలంగాణ మంత్రి
ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూసుకోవడం సూపరింటెండెంట్ ల బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ వైద్య పరికరాలు సమకూరుస్తోందని, వీటిని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగించేలా చూడాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..