Medak Politics: బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కొత్త పంచాయితీ.. పేలుతున్న మాటల తూటాలు
ఆ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల, తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులే కాదు, వాళ్ల అనుచరులు కూడా అసలు తగ్గడం లేదు. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇంతకీ ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో అనుకుంటున్నారా..?
ఆ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల, తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులే కాదు, వాళ్ల అనుచరులు కూడా అసలు తగ్గడం లేదు. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఇంతకీ ఇదంతా ఏ పార్లమెంట్ పరిధిలో అనుకుంటున్నారా..? అదే మెతుకు సీమ మెదక్ లోక్‌సభ నియోజకవర్గం..!
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామా రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం మరింత హీట్ పెంచేసింది. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించక ముందే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు,కార్యకర్తలు ఎవరికివారే తగ్గేదేలేదని అంటున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది.
ఈ రెండు పార్టీల మధ్య లోకల్, నాన్ లోకల్ గొడవ రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుది. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలు విమర్శలు చేస్తూ రాజకీయాలను హిట్ ఎక్కించారు. ఇక బీఆర్ఎస్ నేతలు కూడా అంతే సీరియస్ గా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరును ఆపార్టీ ప్రకటించిన కొద్దిరోజులకే బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇదే ఇప్పుడు రచ్చకు దారి తీసింది.
బీఆర్ఎస్ ఎంపీ టికెట్ వెంకట్రామ్ రెడ్డికి ఎలా ఇస్తారు.. అసలు అతను స్థానికుడు కాదు అని, ఉద్యమకారులు ఆ పార్టీలో లేరని కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఇలా వెంకట్రామ్ రెడ్డిపైనే కాకుండా, బీఆర్ఎస్ పార్టీ పై, పార్టీ అధినేత కేసీఆర్ పై, మాజీ మంత్రి హరీష్ రావు పై పలు కామెంట్స్ చేశారు రఘునందన్ రావు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరం అని, వందల కోట్ల రూపాయలు తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు అమ్ముకుంటుందని, మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి నాన్ లోకల్ వ్యక్తి అని, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శలు గుప్పిస్తున్నారట.
రఘునందన్ చేస్తున్న వ్యాఖ్యలపై చాలా సింపుల్‌గా స్పందించారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి. నాన్ లోకల్ వ్యక్తిని కాదని, తాను మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉండే వ్యక్తిని అని తేల్చి చెప్పేశారు. కానీ బీఆర్ఎస్ అధినేతపై, బీఆర్ఎస్ పార్టీ పై,ఎంపీ అభ్యర్థి పై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్య పై మెదక్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్‌ఎస్ శ్రేణులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. గుజరాత్‌కు చెందిన మోదీ ఎన్నికల్లో ఎక్కడబడితే అక్కడ పోటీచేయవచ్చా అని ప్రశ్నించారు. కరీంనగర్‌కు చెందిన ఈటల రాజేందర్, ఎంపీగా మల్కాజిగిరిలో పోటీ చేయడంపై బీజేపీ పార్టీని రఘునందన్ ముందు ప్రశ్నించాలంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీలో ఉన్న సీనియర్ నేతలను పక్కనబెట్టి రఘునందన్ టికెట్ తెచ్చుకోలేదా అని రఘునందన్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు.. మెదక్ లో ఎలా చెల్లుతాడో చెప్పాలని అటాక్ కౌంటర్లు మొదలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు.
ఇలా ఉమ్మడి మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య లోకల్, నాన్ లోకల్ గొడవతో పాటు, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందట.. ఎంపీ ఎన్నికల ప్రచారం ఇంకా మొదలు కాక ముందే ఇలా ఉంటే.. పూర్తి స్థాయిలో ప్రచారం మొదలు అయితే ఇంకా ఎలా ఉంటుందో అనే ఆలోచనలో పడ్డారట రాజకీయ విశ్లేషకులు.