Accident: ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. మృతులంతా తెలంగాణ వారే..

కర్ణాటక కలబురగిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపోను ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు సమాచారం.

Accident: ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. మృతులంతా తెలంగాణ వారే..
Karnataka Accident
Follow us

|

Updated on: Jun 03, 2022 | 12:06 PM

Road Accident Karnataka: ఘోర ప్రమాదం ఇది. కళ్ల ముందే మంటలు అంటుకున్నాయి, చూస్తుండగానే విస్తరించాయి. ఒక్కసారిగా హాహాకారాలు, మిన్నంటిన ఆర్తనాదాలు.  బస్సులో ఉన్న ప్రయాణికులు దిగే లోపే మంటలు విస్తరించాయి. మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. కర్ణాటక కలబురగి(Kalaburagi)లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపోను ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అంతా ఐపోయింది. కన్నుమూసి తెరిచేలోగా బతుకు బుగ్గయిపోయింది. కళ్ళ ముందే అంతా భస్మమైపోయింది. గుండెలు పగిలిన వారు ఎందరో… కన్నవారో, కట్టుకున్నవారో, తోడ బుట్టినవారో … ఎవరు మరణించారో తెలియదు. ఎవరు బతికున్నారో తెలియదు. కళ్ళముందే విధివికటాట్టహాసం చేసింది. ఒకటి కాదు రెండు కాదు పదులమంది జీవితాకాంక్షలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. గుండెనెత్తురులు ఇంకిపోయే దారుణ ప్రమాదం ఇది. గుక్కపెట్టి ఏడుస్తోన్న బిడ్డలు. ఏడ్చి ఏడ్చి గుండెలవిసిన తల్లులు. మనసుల్ని కలచివేసే దృశ్యాలు. గుండెనిబ్బరాన్ని కోల్పోయే దృశ్యాలు. అంతా తెలుగు బిడ్డలే… అచ్చంగా మన తెలంగాణ బిడ్డలే. ఊహించని విషాదం అలుముకుంది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాదంలో నుంచి బయటపడగలిగిన వారు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో నుంచి బయటకు రాలేక, తన వారిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నంలో బస్సులోనే భస్మమైపోయారు.

బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 12 మందిని రక్షించి హాస్పిటల్‌కు తరలించారు. మంటలకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. బీదర్​-శ్రీరంగపట్టణం హైవేపై కలబురి జిల్లా కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోవా నుంచి హైదరాబాద్​ వస్తుండగా ఈ దారుణం జరిగింది. బస్సును ఆరెంజ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అర్జున్‌ కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం మే 29న వీరంతా గోవా వెళ్లారు. వారు ఈ ఘోరప్రమాదంలో చిక్కుకున్న ఘటన యావత్‌ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గోవాలో ఉత్సాహంతో ఉరకలువేసిన వారు… అంబరాన్నంటే ఆనందాన్ని సొంత చేసుకున్నారు ఇలా మంటల్లో చిక్కుకోవడం విషాదాన్ని నింపింది. పసిబిడ్డల కిలకిల రావాలతో నవ్వులు పూసిన సందర్భం… అంతలోనే విషాదంతం అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి